పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం మొదలైంది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆ జట్టు సారథి బాబర్ ఆజామ్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడు అంచనాలను అందుకోకపోవడంతో పాటు.. లీగ్ దశలోనే పాక్ జట్టు ఇంటిదారి పట్టడంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బాబర్ ఆజామ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.
"నాలుగేళ్ల క్రితం 2019లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించాలని పీసీబీ నుండి పిలుపు వచ్చిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ నాలుగేళ్లలో మైదానం వెలుపలా, బయ టా ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అలాంటివి ఎన్ని జరిగినా దేశ గౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాను."
"వైట్-బాల్ ఫార్మాట్‌లో పాకిస్తాన్ జట్టు నెంబర్. 1 స్థానానికి చేరుకోవడం వెనుక ఆటగాళ్లు, కోచ్‌లు, మేనేజ్‌మెంట్ యొక్క సమిష్టి కృషి ఎంతో ఉంది. అలాగే, మా ఈ ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన దేశ క్రికెట్ అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నా.. పాకిస్తాన్ కెప్టెన్‌గా నేను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నా. ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ ఈ ప్రకటనకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఇకమీదట ఒక ఆటగాడిగా మాత్రమే పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. ఇన్నాళ్లు ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.." అని బాబర్ ఆజామ్ భావోద్వేగ ప్రకటన చేశారు.
— Babar Azam (@babarazam258) November 15, 2023
జాతీయ జట్టులో మార్పులు
కాగా, లీగ్ దశలోనే పాక్ జట్టు ఇంటిదారి పట్టడంతో పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన మొదలుపెట్టింది. టీమ్ మేనేజ్‌మెంట్ సహా జాతీయ జట్టులో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మొత్తం సెలక్షన్ కమిటీని తొలగించిన బోర్డు.. జట్టు విదేశీ కోచ్‌లను కూడా తొలగించేందుకు సిద్ధమైంది.
వరల్డ్ కప్ లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించిన పాక్ సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది.