జూలై 25 నుంచి గ్లోబల్ టీ20 లీగ్ జరగనుంది. ఈ లీగ్ లో పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది పాల్గొనేది అనుమానంగా మారింది. అయితే వీరు ఈ లీగ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వదనే వార్తలు వస్తున్నాయి. వివిధ ఫ్రాంచైజీ లీగుల్లో ఆడే సమయంలో ఫిట్‌గా ఉంటున్న క్రికెటర్లు.. దేశం తరుపున ఆడే మెగా టోర్నీల సమయానికి గాయపడుతున్నారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఈ త్రయానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు పీసీబీ నిరాకరిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
కెనడాలో జరిగే గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్న షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్‌లకు పీసీబీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ జట్టులో ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు. బాబర్ అజామ్ కెప్టెన్ కాగా.. మహ్మద్ రిజ్వాన్ ప్రధాన వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. ఇక షహీన్ అఫ్రిది జట్టు తరపున పేస్ బౌలింగ్ ను నడిపిస్తున్నాడు. GT20 ఇప్పటికీ ICCచే ఆమోదించబడలేదు. పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించడానికి ఇదే కారణం కావొచ్చు.
అక్టోబర్ 2024 నుంచి మే 2025 మధ్య పాకిస్తాన్ ఈ ఏడు నెలల్లో అన్ని ఫార్మాట్లలో 37 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అలాగే ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. దీంతో ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాధాన్యమివ్వాలని పాక్ క్రికెట్ బోర్డు బలంగా కోరుకుంటుంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ క్రికెట్ లీగ్'లో పాల్గొనాలనుకున్న పాకిస్థాన్ పేసర్ నసీమ్ షాకు నిరాశ ఎదురైంది. అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిరాకరించింది.
🚨 Post T20 World Cup disappointment, Babar Azam, Mohammad Rizwan, and Shaheen Afridi denied NOCs for GT20 Canada. pic.twitter.com/m2fTrfIjrK
— CricketGully (@thecricketgully) July 14, 2024