పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాటలే కాదు.. ఆ జట్టు ఆటగాళ్ల మాటలు కోటలు దాటిపోతున్నాయి. మొన్నటిదాకా వేదికలను మార్చితేనే ఇండియాకు వస్తామని పీసీబీ, ప్రభుత్వం అనుమతిస్తేనే ఆడతామంటూ ఆటగాళ్లు కోడై కూశారు. ఈ విషయాన్ని బీసీసీఐ.. ఎంతకీ పట్టించుకోకపోవడంతో వారే తమ రూటు మార్చుకున్నారు. ఇండియాలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఆడతామంటూ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో తమ ఆటగాళ్లకు రక్షణ లేదని, వరల్డ్ వేదికల్లో కొన్నింటిని మార్చాలని పాక్ క్రికెట్ బోర్డు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. చెన్నై, బెంగుళూరు వేదికలను మార్చాలని మొండికేసింది. ఐసీసీ మధ్యవర్తిగా రాయబారం నడిపింది. కానీ బీసీసీఐ అందుకు అంగీకరించలేదు. ఎందుకు మార్చాలంటున్నారో స్పష్టమైన కారణాలు చెప్పాలని పీసీబీకి స్పష్టం చేసింది. మొత్తానికి ఈ విషయంలో బీసీసీఐ ఎంతకూ తగ్గకపోవడంతో పీసీబీకి మరోదారి కనిపించలేదు. దీంతో మిన్నకుండిపోయింది.
వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న ఇండియా- పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందించాడు. భారత్ వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరామని, అయితే కేవలం ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు మాత్రమే అక్కడకు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు.
"మేం ప్రపంచ కప్ లో ఆడేందుకు ఇండియా వెళ్తున్నాం. అంతేకానీ కేవలం భారత్‌తో ఆడేందుకు కాదు. కేవలం ఒక్క మ్యాచ్ మీద, ఒక్క జట్టుపైన దృష్టిపెట్టం. అక్కడ మరో తొమ్మిది జట్లు ఉన్నాయి. వారందరిని ఓడిస్తేనే ఫైనల్ చేరతాం. ప్రపంచంలో క్రికెట్ మ్యాచులు ఎక్కడ జరిగినా ఆడేందుకు మేము ఎప్పుడూ సిద్ధమే. ఇండియాలోనూ అంతే. ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడతాం. ప్రతిదేశంలో మా ప్రదర్శన ఏంటో చూపిస్తాం." అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.