పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ బీఎండబ్ల్యూ బైక్‌పై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాడు. లాహోర్ వీధుల్లో రెడీ, సెట్, గో.. అంటూ అతడు చేసిన సాహస వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. కాకుంటే అతని రైడింగ్ స్కిల్స్ మెచ్చి లక్షల్లో లైకులు వస్తాయనుకుంటే.. సీన్ కాస్తా రివర్స్ అయ్యింది. బాధ్యత గల వ్యక్తివి అయ్యిండి.. ఈ బైక్ స్టంట్లు ఏంటని పాక్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా, ప్రధాన ప్లేయర్‌గా ఆ జట్టు విజయాల్లో బాబర్‌దే కీలకపాత్ర. అందులోనూ ఈ ఏడాది ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి పెద్ద టోర్నీలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా బైక్ స్టంట్లు చేయడం ఎంత వరకూ కరెక్ట్ అని ఫ్యాన్స్ అతనిని ప్రశ్నిస్తున్నారు. బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు. హెల్మెట్ ధరించి బైక్ నడిపినా.. ఇలాంటి సాహసాలు చేసే సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా అన్నది అభిమానుల ఆందోళన.
కాగా, గతేడాది డిసెంబర్ 30న భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తల్లిని సర్ప్రైజ్ చేయాలనుకున్న పంత్, కారును వేగంగా డ్రైవ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ఈ ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి పలు టోర్నీలకు దూరమయ్యాడు. పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. తిరిగి జట్టులో చేరడానికి చాలా సమయం పట్టొచ్చు.