వరల్డ్ కప్ లో భారత అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నమ్యాచ్ ఇండియా-పాకిస్థాన్. సహజంగా వీరు తటస్థ వేదికలపై తలపడితేనే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక భారత్ లో.. దాయాదుల సమరం అంటే ఆ క్రేజ్ ఆకాశాన్ని దాటేయడం గ్యారంటీ. మరో పది రోజుల్లో వరల్డ్ కప్, 20 రోజుల్లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుండడంతో రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్లు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ భారత్ కి సవాలు విసురుతూ మ్యాచ్ పై మరింత ఇంట్రస్ట్ పెంచేసాడు.
ఆసియా కప్ లో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్థాన్ కనీసం ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీ అనంతరం బాబర్ అజామ్ కెప్టెన్సీ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఓ వైపు స్టార్ ప్లేయర్ల గాయాలు, మరోవైపు జట్టులో విబేధాలు పాక్ ను మరింతగా కృంగదీశాయి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబర్.. భారత్-పాక్ మధ్య పోటీ హైలెట్ గా ఉండబోతుందని చెప్పాడు.
అందరిలాగే నేను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదరు చూస్తున్నాని.. అందరికి సమాధానం చెప్పే రోజు వస్తుందని తెలిపాడు. దీంతో బాబర్ భారత్ మ్యాచ్ ని సీరియస్ గానే తీసుకున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఇక కెప్టెన్సీలో విమర్శలు ఎదుర్కుంటున్నా.. బ్యాటర్ గా వన్డేల్లో బాబర్ టాప్ ర్యాంక్ లో ఉన్నాడు. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న మ్యాచ్ జరగనుంది.