వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ క్రికెట్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజాం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మిగిలిన సిబ్బందిపై ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ వేటు వేసింది. జట్టుతో సంబంధం ఉన్న విదేశీ సిబ్బందిని పూర్తిగా తొలగొంచి.. ఆ బాధ్యతలను స్వదేశీయులకు అప్పగించింది. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయాలపై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ స్పందించారు.
బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుండి తొలగించడం పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన అతిపెద్ద తప్పిదమని హర్భజన్ అభిప్రాయపడ్డారు. ఈ చర్యలు పాక్ క్రికెట్‌పై ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రతికూల సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పాక్ క్రికెట్ను వెనక్కి నెట్టవచ్చని మాట్లాడారు.
"భారత్, పాక్ ఇరు దేశాలలోనూ క్రికెట్‌కు గణనీయమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు రాణించకపోతే అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుంది. గతంలో ఎన్నో సార్లు అలాంటి ఘటనలు జరిగాయి. అయితే, బాబర్ కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదని నేను అనుకుంటున్నా. ప్రపంచ కప్ ఓటములకు ప్రతిస్పందనగా తీసుకున్నట్లు ఉంది. ఇది మిమ్మల్ని(పాక్ క్రికెట్ను) వెనక్కి నెట్టవచ్చు. ముందుకు కాకుండా వెనుకకు పురోగమించడానికి ఇదొక ఒక కారణం అవుతుందని నేను అభిప్రాయపడుతున్నా.."
"బాబర్ మంచి ఆటగాడు.. అయితే, జట్టులో అతనితో పాటు ప్రతిభావంతులైన ఇతర ఆటగాళ్ళు ఉన్నారు. వారూ రాణించాలి. జట్లు కేవలం ఒక ఆటగాడి వల్ల మాత్రమే గెలవవు. మొత్తం జట్టు బాగా రాణిస్తేనే గెలుస్తారు. సమిష్టి కృషి అవసరం. మనం తరచుగా ఒక ఆటగాడిని విస్తృతంగా ప్రశంసించడం, మరొకరిని విమర్శించడం చూస్తుంటాం.. ఉదాహరణకు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూనే, బాబర్ గురించి చాలా మాట్లాడుతుంటారు. అలాంటి వారందరూ ఒక్క ఆటగాడి వల్ల విజయం సాధించలేమని తెలుసుకోవాలి. మున్ముందు బాబర్ మంచిగా రాణించాలని, రాణిస్తాడని ఆశిస్తున్నా.." అని హర్భజన్ స్థానిక క్రికెట్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బాబర్ అజామ్ కెప్టెన్సీ మార్పుపై హర్భజన్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను పాక్ అభిమానులూ సమర్థిస్తున్నారు. కాగా, ప్రస్తుతం షాహీన్ ఆఫ్రిది పాక్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉండగా, షాన్ మసూద్ టెస్ట్ జట్టు సారథిగా ఉన్నాడు.