రాజనీతి దార్శనికుడురాజనీతి దార్శనికుడు : డా. అద్దంకి దయాకర్

రాజనీతి దార్శనికుడురాజనీతి దార్శనికుడు : డా. అద్దంకి దయాకర్

బాబాసాహెబ్​ అందేద్కర్​ భారతదేశపు సిసలైన రాజనీతిజ్ఞుడు. జాతి మేధను ప్రపంచానికి పరిచయం చేసిన సంపన్నుడు. సింధూలోయ నాగరికతలో పుట్టిన బాబాసాహెబ్ ప్రపంచ మానవీయ రాజకీయాలను ప్రభావితం చేసిన మహనీయుడు. నిమ్నవర్గాల్లో జన్మించినా తన ఆలోచనా విధానంలో అత్యున్నత గుణాలు కలిగిన నిజాయితీ, నిబద్ధతతో ఆణిముత్యం అయ్యాడు. భారతదేశ మూలవాసిగా పేరుగాంచిన అంబేద్కర్​ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూనే మనువాదాన్ని వ్యతిరేకించాడు. ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించి అస్పృశ్యులకు దేవుడయ్యాడు.  అసమానత్వంతో నిర్మితమైన భారత దేశ ఏర్పాటును సమానత్వం వైపు తీసుకెళ్లే మార్గాలను తన పుస్తకాల్లో సూచించాడు. కుల, మత, ప్రాంత వైరుధ్యాలతో పాటు భాషా వైవిధ్యాలతో ఏర్పాటైన దేశానికి రాజ్యాంగం రాయడం అనేది అంత  సులభమైన అంశం కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదానికి ప్రతిరూపంగా రాజ్యాంగ రచన చేశాడు. అంబేద్కర్​ పుట్టుక సమానత్వానికి ప్రతీక అయ్యింది. పూలే ఆశయమైన సామాజిక న్యాయాన్ని  తన కార్యాచరణగా మార్చుకొని దేశ, విదేశాల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమించిన ధీరుడు.బ్రిటన్​, అమెరికాల్లో చదివిన అనుభవంతో ప్రపంచస్థాయి ఆలోచనలను భారతదేశానికి అందించిన మేధావి. ఆర్బీఐ ఏర్పాటు, 1935 బ్రిటిష్​ ఇండియా గవర్నమెంట్ చట్టం తయారులో పాలు పంచుకోవడం, రౌండ్​టేబుల్​ సమావేశాల వల్ల తన ఆలోచనలను ప్రపంచం ముందు ఉంచి కొత్త రాజకీయ ఒరవడిని తెలియపరిచాడు. రాజనీతి గతిని మార్చేందుకు తన అసమాన ప్రతిభను ఉపయోగించాడు అంబేద్కర్​. 

తెలంగాణ ఏర్పాటు వెనుక..

అలాంటి విలువలు గల రాజకీయ దురంధరుడి విగ్రహం 125 ఫీట్లతో హైదరాబాద్​లో ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ అంశమే అయినప్పటికీ ఆయన స్పూర్తిని పాలకులు విస్మరించడం ఆలోచించాల్సిన అంశం. అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సీఎం  కేసీఆర్..  అంబేద్కర్​ ఎంతో శ్రమకోర్చి నిర్మించిన రాజ్యాంగాన్నే మార్చాలని అనడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనం.​ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగం లోని  ఆర్టికల్​ 3 వల్లనే తెలంగాణ సాధ్యమైందన్న కేసీఆర్​.. రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం కావాలనడం భారత దళిత, బడుగు సమాజం మర్చిపోదు. సమానత్వం, సమసమాజం, సామాజిక న్యాయం కోసం  రాసిన రాజ్యాంగాన్నే తప్పు పట్టడం అంబేద్కర్ ను అవమానించడమే అవుతుంది.  అంబేద్కర్​ రాజ్యాంగం తెలంగాణలో ఏమేరకు అమలవుతున్నదో పాలకులే ఆలోచించాలి. ఇసుక లారీలతో దళితులను తొక్కించడం, థర్డ్​ డిగ్రీలు ప్రయోగించి కనీసం పనిచేసుకొని బతకలేకుండా మార్చినప్పుడు అంబేద్కర్​ ఎందుకు గుర్తుకు రాలేదు?  ఎస్సీ,​ ఎస్టీ సబ్ ప్లాన్​ నిధులను దారి మళ్లించిన వారికి అంబేద్కర్​ పట్ల ప్రేమ ఎక్కడుంది? నిమ్న వర్గాలకు ఎప్పుడు అన్యాయం తలపెట్టినా  అంబేద్కర్​ నిలువెత్తు విగ్రహం  పాలకులను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటది. ఈ విషయం ఎవరూ మర్చిపోవద్దు. ఇకనైనా ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం పాటిస్తే మంచిది.

స్త్రీ సమానత్వం, బీసీ రిజర్వేషన్ల కోసం..

ఈ దేశంలో చాలామంది బాబాసాహెబ్​ భావజాలాన్ని హిందూవ్యతిరేక భావజాలంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అంబేద్కర్​ హిందూత్వలో ఉన్న ఆధిపత్యాన్ని మాత్రమే ప్రశ్నించాడు. చాతుర్వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాడు. స్త్రీ సమానత్వాన్ని కోరుకొని కాంగ్రెస్​తో విభేదించాడు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఆగ్రహించాడు. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఇంకా పార్లమెంటులో పాస్​ కాకపోవడం అంబేద్కర్​ గారికి అవమానమే.  అంబేద్కర్​ వారసత్వం అంటే విగ్రహాలు పెట్టడమే కాదు, ఆయన భావజాలాన్ని అనుసరించడమేనని నా భావన.​ ఇప్పటికీ బాబాసాహెబ్​ వారసులు కావాలనుకునే వారు, ఆయన ఎక్కడైతే ఉద్యమాన్ని ఆపాడో అక్కడి నుంచి  మొదలు పెట్టాలి.  మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ప్రవేశపెట్టాలని పోరాడాలి. సమాజంలో సగం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. భూమిని జాతీయం చేయాలని పోరాడాలి . అన్నికులాల్లో ఉన్న పేదలకు కనీసం ఒక ఎకరం భూమి అయినా ఇచ్చేటట్లుగా పోరాడాలి. సంపద పంపిణీ సమంగా జరిగేందుకు పోరాడాలి.

డా. అద్దంకి దయాకర్, వ్యవస్థాపక అధ్యక్షుడు,మాలమహానాడు