యూపీలో బబ్బర్ ఖాల్సా టెర్రరిస్టు అరెస్టు.. మహా కుంభమేళాపై భారీ ఉగ్రదాడికి కుట్ర

యూపీలో బబ్బర్ ఖాల్సా టెర్రరిస్టు అరెస్టు.. మహా కుంభమేళాపై భారీ ఉగ్రదాడికి కుట్ర

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబిలో బబ్బర్  ఖాల్సా ఇంటర్నేషనల్  (బీకేఐ) టెర్రరిస్టును పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. యూపీ స్పెషల్  టాస్క్ ఫోర్స్, పంజాబ్  పోలీసులు జాయింట్ ఆపరేషన్  నిర్వహించి ఆ టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్నారు. ప్రయాగ్ రాజ్ లో 45 రోజుల పాటు ఘనంగా జరిగిన మహా కుంభమేళాపై భారీ ఉగ్రదాడికి  అతను కుట్రపన్నాడు. 

అతడిని పంజాబ్ లోని అమృత్ సర్  జిల్లా కుర్లియన్  గ్రామస్తుడు లాజర్  మసీగా గుర్తించారు. వివరాలను యూపీ డీజీపీ ప్రశాంత్  కుమార్  గురువారం మీడియాకు వెల్లడించారు. మహా కుంభమేళాపై భీకర దాడులు చేయాలని మసీ  కుట్రపన్నాడని, అయితే.. మేళా జరిగిన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో అతని ప్రయత్నాలు ఫెయిల్  అయ్యాయని డీజీపీ తెలిపారు. 

‘‘తన కుట్ర విఫలం కావడంతో ఫేక్  పాస్ పోర్టుతో మసీ దేశం విడిచి పారిపోవాలనుకున్నాడు. పోర్చుగల్ లో తలదాచుకోవాలని భావించాడు. పాక్ లోని ఐఎస్ఐ ఏజెంట్లతో మసీకి సంబంధాలు ఉన్నాయి. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు, డ్రగ్స్  సప్లయ్  చేసినందుకు గతంలో అతను అరెస్టయ్యాడు. నిరుడు సెప్టెంబరు 24న అమృత్​సర్​లోని గురునానక్ దేవ్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకున్నాడు. ఎట్టకేలకు అతడిని గురువారం తెల్లవారుజామున కౌశాంబిలో పట్టుకున్నాం” అని డీజీపీ ప్రశాంత్  కుమార్  వివరించారు.

పాక్ నుంచి డ్రగ్స్, ఆయుధాలు

మసీ డ్రోన్ల సాయంతో పాక్  నుంచి భారత్ లోకి డ్రగ్స్, ఆయుధాలు సప్లై చేశాడని డీజీపీ తెలిపారు. పిలిభిత్ లో హతమైన టెర్రరిస్టు వీరేశ్  సింగ్  అలియాస్  రవితోనూ మసీకి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.