చంద్రయాన్ - 3మిషన్ చంద్రునిపై సేఫ్ గా ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జన్మించిన అనేక మంది శిశువులకు 'చంద్రయాన్' అని పేరు పెట్టారు. జిల్లా ఆసుపత్రిలో జన్మించిన నలుగురు శిశువులు, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి వారి తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారు. “ఇది రెట్టింపు ఆనందం. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన కొద్ది నిమిషాలకే మా పాప పుట్టింది. అందుకే మా బిడ్డకు ఈ పేరు పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము”అని ఆ నలుగురు శిశువులలో ఒకరి తండ్రి చెప్పారు.
శిశువు పుట్టిన 21వ రోజున శిశువుకు పేరు పెట్టడం స్థానిక సంప్రదాయం. ఈ క్రమంలో తమ మగబిడ్డకు చంద్రయాన్ పేరు పెట్టాలని పెద్దలకు సూచిస్తామని అరిపాడు గ్రామానికి చెందిన మల్లిక్ భార్య రాణు తెలిపారు. చంద్రయాన్ అంటే చంద్రునికి వాహనం అని అర్థం. కాబట్టి పిల్లల పేరు "చంద్ర" లేదా "లూనా" అని కూడా ఉండవచ్చని ఆమె చెప్పారు. “అయితే చంద్రయాన్ అనేది స్టైలిష్ పేరు. 21వ రోజు పూజ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆమె చెప్పింది.
దుర్గా మండలం తలచువా గ్రామానికి చెందిన జోష్న్యారాణి, నీలకంఠాపూర్‌కు చెందిన బాల్, అంగులేయ్ గ్రామానికి చెందిన బేబీనా సేథి కూడా ఆగస్టు 23న సాయంత్రం బిడ్డలకు జన్మనిచ్చారు. దుర్గకు పుట్టిన పాప ఆడపిల్ల కాగా, మరో ఇద్దరు మగపిల్లలు. “కొత్త తల్లులందరూ తమ పిల్లలకు చంద్రయాన్ పేరు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు” అని కేంద్రపారా ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ నర్సు అంజనా సాహూ తెలిపారు. గతంలో కోస్తా జిల్లాను తాకిన తుపానుల పేర్లను పలువురు శిశువులకు పెట్టారని ఆమె గుర్తు చేశారు.