- రోడ్లు, డ్రైన్లలో నవజాత శిశువుల మృతదేహాలు
- కండ్లు తెరవక ముందే కాటికెళ్తున్న పసిప్రాణాలు
- విచారణను గాలికొదిలేస్తున్న ఆఫీసర్లు
- కనీస చర్యలు లేక తరచూ ఇవే ఘటనలు
హనుమకొండ, వెలుగు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డలు కండ్లు తెరవక ముందే కాటికి చేరుతున్నారు. ఆడ శిశువులనో.. లేదా ఆర్థిక భారమనుకునో.. మరే ఇతర కారణాలోగానీ పుట్టిన కొద్దిసేపటికే పసికందుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో బాధ్యులను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాల్సిన అధికారులు లైట్ తీసుకుంటున్నారు. సీరియస్ యాక్షన్ లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిలాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా, ఎంతోమంది ముక్కుపచ్చలారని శిశువులు మురుగు కాల్వల్లోనో, చెత్తకుప్పల్లోనో శవాలై తేలుతున్నారు.
విచారణ నామమాత్రమే..
ఒక మహిళ గర్భం దాల్చిన తరువాత ఐసీడీఎస్ అంగన్ వాడీ రికార్డ్స్ తోపాటు ప్రభుత్వ పోర్టల్‌లో వివరాలు ఎంటర్ చేస్తుంటారు. వాటి ఆధారంగానే పాలు, గుడ్లు, ఇతర పోషకాహారం అందించడంతోపాటు టీకాలు కూడా ఇస్తుంటారు. కాగా, నవజాత శిశుమృతదేహాలు లభించినప్పుడు ఆయా రికార్డ్స్ ఆధారంగానైనా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం లేదనే విమర్శలున్నాయి.
దీంతోనే ఉమ్మడి జిల్లాలో తరుచూ నవజాత శిశు మృతదేహాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పెద్ద చెరువు సమీపంలోని డ్రైనేజీలో, అంతకుముందు భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ముదిరాజ్ కాలనీలో నవజాత శిశువు మృతదేహాలు బయటపడ్డాయి. ఇలాంటి ఘటనలను ట్రేస్ఔట్ చేసేందుకు జిల్లా వైద్యాధికారులతోపాటు పోలీస్, చైల్డ్‌లైన్ ఆఫీసర్లు సమన్వయంగా పని చేయాల్సి ఉంది. ఎంక్వైరీ చేపట్టి యాక్షన్ తీసుకోవాల్సిన అధికారులు నామమాత్రపు విచారణతో సరి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఏటా పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే విమర్శలున్నాయి.
ఆడపిల్ల అని తేలితే అంతే..
కాసులకు కక్కుర్తి పడుతున్న కొన్ని ఆసుపత్రులు ఇష్టారీతిన అబార్షన్లకు పాల్పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీల ద్వారా గర్భిణులను ఆసుపత్రులకు రప్పించడం, ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడో, మగో చెప్పడం యథేచ్ఛగా సాగుతోంది. దీంతోనే గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి హాస్పిటళ్లపై కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి. కాగా, చాలామంది లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారు.
అప్పటికే నెలలు నిండితే మాత్రం డెలివరీ అయ్యాక చెత్తకుప్పలు, మురుగుకాల్వల్లోనో వదిలేసి శిశు మరణాలకు కారణమవుతున్నారు. దీంతో జిల్లాల్లో ఏటికేడు ఆడపిల్లల జనాభా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికైనా నవజాత శిశు మరణాలు, అబార్షన్లపై జిల్లా అధికారులు దృష్టి సారించి బాధ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై డీఎంహెచ్‌వో సాంబశివరావును ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా, స్పందించకపోవడం గమనార్హం.
ఏప్రిల్ 15: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ విలేజ్ లోని పెద్ద చెరువులో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్తున్న రైతులు శిశువు మృతదేహాన్ని గమనించి, అధికారులకు సమాచారమిచ్చారు. వారువచ్చి శిశువు మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కానీ, శిశువు మరణానికి బాధ్యులెవరనేది ఇంతవరకు తేలియలేదు.
మే 4: దామెర మండలం ఊరుగొండ శివారులో అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువును బతికుండగానే గుర్తు తెలియని వ్యక్తులు మట్టిలో పాతిపెట్టి వెళ్లారు. సరిగా కండ్లు కూడా తెరవని ఆ చిన్నారి మట్టిలో కదులుతుండగా, ఓ లారీ డ్రైవర్ గమనించడంతో చివరికి ఆ శిశువు ప్రాణాలు దక్కాయి. ఈ దారుణానికి కారకులెవరో తేలాల్సి ఉంది.