
బాసర, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ గేట్లను ప్రతి సంవత్సరం జూలై 1న ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అలాగే 0.6 టీఎంసీల నీటిని మార్చి 1న ఎస్సారెస్పీకి వదలాలని తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదులుతారు.
దీంతో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో గోదావరికి జలకళ రానుంది. ప్రతి ఏటా మార్చి 1న గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోకి 0.2 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరుతుంది. కాగా, 0.6 టీఎంసీల కోటా పూర్తి కాగానే గేట్లను మూసివేయనున్నారు. నీటి విడుదల ప్రక్రియలో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పాల్గొన్నారు.