సామాజిక యోధుడు జగ్జీవన్ రామ్​

సామాజిక యోధుడు జగ్జీవన్ రామ్​

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే,  మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌.  జాతి జనులను  విద్యావంతులుగా,  ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే ఆయన లక్ష్యం.  జగ్జీవన్‌ రామ్​ బిహార్‌లోని  షాబాద్‌ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్‌ 5న శోభిరామ్,  బసంతిదేవిలకు జన్మించారు.  ఆయన చదువుకున్న  పాఠశాలలోనే  మొదటిసారిగా  అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఆ పాఠశాలలో  విద్యార్థుల కోసం  మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవల విధానం పాటించేవారు.

పాఠశాలలో జగ్జీవన్‌ రామ్‌  తమ మంచినీరు తాగారని  ఇతర విద్యార్థులు ఆ కుండలోని నీరు తాగేవారు కాదు. ఈ ఉదంతంతో  ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల  ప్రధానోపాధ్యాయుడు ‘హరి జన పానీ’ అనే  మరో కుండను ఏర్పాటు చేశాడు. జగ్జీవన్‌ రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్‌ రామ్‌ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.    

ఉప  ప్రధానిగా ప్రజాసేవ

జగ్జీవన్‌ రామ్‌  కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.  ఈ సంఘటన ఆనాడు ఒక రికార్డు.  బెనారాస్ హిందు విశ్వవిద్యాలయంలో  పీజీ  పూర్తి చేశారు.  జగ్జీవన్‌ రామ్‌ చరిత్రనే  తిరగరాశారు.   57 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవశీలి. వ్యవసాయశాఖ, రక్షణ, ఆరోగ్య,  రైల్వే, రక్షణశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం.    ప్రతి బాధ్యతలోనూ తనదైన ముద్రవేసిన కార్యశాలి.  

బ్రిటీష్ రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతీయ ముద్ర వేశాడు‌.   విద్యార్థి దశలోనే  గాంధీజీ  అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు.  వివక్షను ఎదుర్కొంటూ ఉప ప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్‌ రామ్‌ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనం.  ప్రజాసేవకే తన జీవితాన్ని అంకింతం చేసిన ఆయన 1986 జులై 6న పరమపదించారు.  జగ్జీవన్‌ రామ్‌ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా  సమతా దినోత్సవంగా జరుపుతుంది. 
  

నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్ రామ్​

లాహోర్‌లో 1929 డిసెంబర్‌ 1న జరిగిన కాంగ్రెస్‌  మహాసభలో పాల్గొంటూనే  జగ్జీవన్‌ మరోవైపు దళిత జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితంలో విశిష్టమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. 1967–70లో ఆహార, వ్యవసాయ శాఖా మంత్రిగా హరిత మండలాలను అభివృద్ధి చేసి మొదటిసారి భారతదేశం ఆహార స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా చేశారు. దేశాన్ని కరువు బారి నుంచి కాపాడారు. 

1970–74లో రక్షణ శాఖా మంత్రిగా పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసి, పాకిస్తాన్‌ సేనలు బేషరతుగా లొంగిపోయేలా చేశారు. 1980లో కృష్ణా జిల్లా ప్రాంతంలో కంచికచర్ల  కోటేశు అనే మాదిగను కట్టేసి చంపి బూడిద చేసినప్పుడు  ప్రత్యేక విమానంలో వచ్చి కన్నీటి పర్యాంతమై నివాళి అర్పించారు.‌ నేటి తరం  దళిత ప్రజాప్రతినిధులు జగ్జీవన్‌ రామ్‌ అంతర్ హృదయాన్ని ఆదర్శంగా తీసుకొని జాతికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

- సంపత్​ గడ్డం​