నల్లగొండ : ఆపదలో ఉన్న వారిని ఆదుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు వేసి గెలిపించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి బాబుమోహన్ పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచిపోయారంటూ మండిపడ్డారు. కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత నియోజకవర్గాల్లో మాత్రం అభివృద్ధికి కోసం నిధులు విడుదల చేస్తారు గానీ, మిగతా నియోజకవర్గాలను మరిచిపోతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ఆడే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ‘బాబుమోహన్ అబద్ధాలు చెప్పి నవ్వించడు. నిజాలు చెప్పి నవ్వించే వ్యక్తి’ అని వ్యాఖ్యానించారు. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో బాబుమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.