కొడుకు పేరు మీద బాబు మోహన్ ట్రస్ట్

కొడుకు పేరు మీద బాబు మోహన్ ట్రస్ట్
  • ఆర్థికంగా వెనుకబడి వారికి చేయూత
  • త్వరలో జిల్లా కో-ఆర్డినేటర్ల ప్రకటన

బషీర్​బాగ్, వెలుగు: తన కొడుకు పేరు మీద మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్​ను ప్రారంభించారు. విద్య, వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడి వారికి ‘పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్’ తో చేయూత అందించనున్నట్లు తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడారు. తన కొడుకు 2003లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, ఆ సమయంలోనే ట్రస్ట్ పెట్టాలని అనుకున్నానని చెప్పారు.

కానీ, రాజకీయాల్లో ఉండడం వల్ల సాధ్యం పడలేదన్నారు. ఇప్పుడు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన సమీప అనే యువతి చదువు బాధ్యతలను తాను తీసుకున్నట్లు బాబు మోహన్ తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ట్రస్ట్ కో-ఆర్డినేటర్లను ప్రకటిస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 8919511215 నంబర్​ను సంప్రదించాలని సూచించారు.