మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేత బాబుమోహన్ ప్రచారం చేస్తుండగా గొడవ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. తమ మైకులను బీజేపీ కార్యకర్తలు గుంజుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు పక్కనే ఉండి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాబుమోహన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. కేసీఆర్.. ఆయన కొడుకు, అల్లుడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందనే భయం టీఆర్ఎస్ లో కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు.
మునుగోడులో గెలుపు కోసం పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు.