
కాగజ్‌నగర్, వెలుగు: బాలింత చనిపోవడానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని నౌగాంబస్తీకి చెందిన చునార్కర్ శ్వేత (27)కు పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్లు శిశువు గర్భంలోనే చనిపోయిందని, ఆపరేషన్ చేసి బయటకు తీస్తామని చెప్పారు. శిశువు బాడీని బయటకు తీసిన తర్వాత శ్వేత పరిస్థితి విషమించింది. దీంతో మంచిర్యాలకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో కాగజ్‌నగర్ పట్టణంలోని హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే శ్వేత చనిపోయిందంటూ ఆమె బంధువులు హాస్పిటల్ ఎదుట మెయిన్‌రోడ్డుపై డెడ్‌బాడీతో ధర్నాకు దిగారు.
అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శంకరయ్య ఘటనాస్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పడం ఆందోళన విరమించారు.