కొండమల్లేపల్లి, వెలుగు : అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తకుప్పలో పడేశారు. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్ రోడ్ లో గల వాసవి బజారులో చెత్తకుప్పలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చూశారు.
అప్పుడే పుట్టిన మగబిడ్డగా గుర్తించి స్థానిక ఎస్సై, అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరబాబు.. అంగన్ వాడీ సిబ్బంది సహాయంతో శిశువుకు ప్రథమ చికిత్స చేశారు. స్థానిక వార్డు మెంబర్ శంకర్ గౌడ్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనంలో శిశువును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందని, గ్రహణ మెర్రితో జన్మించడం వల్లే వదిలివెళ్లారని ఎస్సై తెలిపారు