నల్గొండ హాస్పిటల్‌‌లో శిశువు మృతి.. మూకుమ్మడిగా సెలవు పెట్టిన డాక్టర్లు, నర్స్‌‌లు

  • సకాలంలో ట్రీట్‌‌మెంట్‌‌ అందకపోవడమే కారణమని బంధువుల ఆందోళన
  • కుర్చీపైనే మహిళ డెలివరీ అయిన ఘటనపై నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు
  • మూకుమ్మడిగా సెలవు పెట్టిన డాక్టర్లు, నర్స్‌‌లు

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ఏరియా హాస్పిటల్‌‌లో గర్భిణికి ఆపరేషన్‌‌ చేస్తుండగా శిశువు చనిపోయింది. అయితే డాక్టర్లు ఆలస్యంగా ఆపరేషన్‌‌ చేయడం వల్లే శిశువు చనిపోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గ్యారకుంటపాలెం గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీలత డెలివరీ కోసం శనివారం అర్ధరాత్రి నల్గొండలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చింది. అయితే ఈ నెల 23న కుర్చీలోనే మహిళ డెలివరీ అయిన ఘటనపై ఆఫీసర్లు నోటీసులు జారీ చేయడంతో డాక్టర్లు, నర్సులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. శనివారం రాత్రి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో శ్రీలతను మరో హాస్పిటల్‌‌కు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. 

ఈ టైంలో డ్యూటీకి వచ్చిన ఓ డాక్టర్‌‌ గర్భిణి కుటుంబసభ్యులతో మాట్లాడి హాస్పిటల్‌‌లోకి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించింది. శిశువు గుండె కదలికలు తగ్గుతున్నాయని గుర్తించి వెంటనే శ్రీలతకు ఆపరేషన్‌‌ చేశారు. అప్పటికే మగ శిశువు చనిపోయాడు. దీంతో డాక్టర్లు సకాలంలో డెలివరీ చేస్తే శిశువు బతికేదని, ఆలస్యం చేయడం వల్లే బాబు చనిపోయాడంటూ శ్రీలత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శిశువు మృతికి కారణమైన డాక్టర్‌‌తో పాటు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శ్రీలత భర్త రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

ఈ విషయంపై జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ మూర్తి మాట్లాడుతూ గర్భిణికి జ్వరం ఉండడం, గర్భంలోని శిశువు పల్స్‌‌ రేటు పడిపోతుండడాన్ని గ్రహించిన డాక్టర్‌‌ వెంటనే ఆపరేషన్‌‌ చేశారని, కానీ అప్పటికే శిశువు చనిపోయిందని చెప్పారు. మరో వైపు గురువారం రాత్రి ఓ గర్భిణి కుర్చీలోనే డెలివరీ అయిన ఘటన మరువకముందే ఆదివారం శిశువు చనిపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంకా డ్యూటీలో చేరని డాక్టర్లు

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి కుర్చీలోనే మహిళ డెలివరీ అయిన ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆఫీసర్లు డాక్టర్లు, నర్సులకు నోటీసులు జారీ చేశారు. దీనికి నిరనసగా వారంతా ఒకేసారి సెలవు పెట్టి విధులకు దూరంగా ఉన్నారు. డాక్టర్లు ఇంతవరకూ డ్యూటీకి హాజరుకాలేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సూపరింటెండెంట్‌‌ మూర్తి తెలిపారు.