
- హాస్పిటల్ ముందు కుటుంబసభ్యుల ఆందోళన
- మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
మంచిర్యాల, వెలుగు: శిశువు మృతికి డాక్టర్లు, వైద్య సిబ్బంది కారణమని ఆరోపిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు హాస్పిటల్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నెన్నెలకు చెందిన గావిడి సుమలతకు నెలలు నిండడంతో ఈనెల12న మంచిర్యాల మాత శిశు హాస్పిటల్ కు డెలివరీ కోసం కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆ రోజు ఓపీ టైమ్ అయిపోయిందని రేపు రావాలని వైద్య సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగిపోయారు.
గురువారం ఉదయం వెళ్లగా సుమలతను డాక్టర్లు పరీక్షించారు. సాయంత్రం తర్వాత కడుపులోని బిడ్డ చనిపోయిందని ఆడ శిశువును అందించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. డెలివరీ కోసం ఒక రోజు ముందే వెళ్తే.. పెద్ద డాక్టర్లు లేరని అడ్మిట్ చేసుకోకుండానే పంపించారని.. మళ్లీ వస్తే టెస్టులు చేసి కడుపులోనే మృతి చెందినట్లు చెప్పి శిశువును అందించారని వాపోయారు. శిశువు మృతికి కారణమైన డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సుమలత భర్త రాజన్న, కుటుంబ సభ్యులతో పాటు సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారుల హామీతో ధర్నా విరమించారు.