రెండేళ్లుగా కోమాలో చిట్టితల్లి.. కాపాడుకునేందుకు.. కన్నతల్లి కష్టాలు!

రెండేళ్లుగా కోమాలో చిట్టితల్లి..  కాపాడుకునేందుకు.. కన్నతల్లి కష్టాలు!
  • రెండేండ్ల కింద కుక్కల దాడితో గాయపడిన చిన్నారి
  • చికిత్స పొందుతూనే కోమాలోకి వెళ్లిన హారిక  
  • ఆస్పత్రులకు లక్షలు పోసినా ఫలితం లేదు 
  • దీనస్థితిలో సాయం కోసం వేడుకుంటోన్న తల్లి  

హాలియా, వెలుగు: చిట్టితల్లిని కాపాడుకునేందుకు ఓ తల్లి కన్న కష్టాలు పడుతోంది. భర్త చనిపోవడంతో  ఇబ్బందులు ఎదుర్కొంటూ.. కన్నీళ్లను దిగమింగుతూ కూతురి జబ్బును నయం చేసేందుకు ఒంటరిగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. ఆర్థికంగా కష్టాలు పడుతూనే కూతురి ప్రాణాలు దక్కించుకునేందుకు  సాయం కోసం వేడుకుంటోంది.  వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీకి చెందిన మహిళ సిద్వంతి భర్త రెండున్నరేండ్ల కింద చనిపోయాడు.

ఆమె తన ఇద్దరు కూతుళ్లతో పుట్టింటికి చేరింది. రెండేండ్ల కింద చిన్న కూతురు  హారిక ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో సాగర్ లోని కమల నెహ్రూ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. కుక్కకాటు టీకా మూడు డోసులు వేశారు. చిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ఎంతకూ తగ్గడంలేదు. డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే చిన్నారి హారిక కాళ్లు, చేతుల స్పర్శ కోల్పోయింది.  

మళ్లీ డాక్టర్ల సూచనతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి కోమాలోకి పోయింది.  రెండేండ్లుగా నల్గొండ, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్సలకు లక్షలు ఖర్చు చేసినా కూతురి జబ్బు తగ్గడం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నట్టు.. ప్రభుత్వం స్పందించి వైద్యానికి సాయం అందించి  చిన్నారి కాపాడాలని తల్లి కోరుతోంది.