- మంచిర్యాల ఎంసీహెచ్‌లో కలకలం
- విచారణ చేపట్టని అధికారులు!
మంచిర్యాల, వెలుగు: పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ ఆడవ శిశువును రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఐసీడీఎస్ అధికారులు అడ్డుకొని, శనివారం ఆ శిశువు ఆదిలాబాద్‌లోని శిశుగృహకు తరలించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గర్భంలో ఉండగానే హైదరాబాద్‌కు చెందిన కొందరు రూ.5లక్షలకు బేరం పెట్టి రూ. 4 లక్షలు మహిళకు ఇచ్చేలా ఒప్పదం చేసుకున్నట్టు తెలుస్తోంది. బెల్లంపల్లి గంగారాంనగర్కు చెందిన ఓ మహిళ ఈనెల 12న ఎంసీహెచ్‌లో పాపకు జన్మనిచ్చింది.
ఆస్పత్రిలో చేరిన టైంలో ఆమె తప్పుడు అడ్రస్చెప్పింది. రెండు రోజుల కిందట హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులు శిశువును తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. డాక్టర్లకు విషయం తెలిసి శిశువు అమ్మకాన్ని అడ్డుకున్నారు. తల్లి తనకు బిడ్డ వద్దని చెప్పడంతో ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు శిశువును స్వాధీనం చేసుకొని, శనివారం ఆదిలాబాద్‌లోని శిశుగృహకు తరలించారు.
అమ్మకంపై స్పందనేది?
ఈ బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ద్వారా శిశువును అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. మీడియేటర్ల వివరాలను పోలీసులకు తెలియజేశామని చైల్డ్‌ప్రొటెక్షన్ అధికారులు చెప్తుండగా.. తమకు ఎలాంటి కంప్లయిట్రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగితే ఎలాంటి స్పందనా లేదు. ఉన్నతాధికారులు స్పందించి శివువు అమ్మకానికి తల్లిని ప్రోత్సహించిందెవరు? మీడియేటర్‌కు డబ్బులు ఇచ్చిందెవరు? బిడ్డను ఆశించిందెవరన్న విషయాలపై ఎంక్వయిరీ జరపాల్సిన అవసరం ఉంది.