
‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు రూపొందించిన తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. అల్లరి నరేష్ హీరోగా రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు సినిమా విశేషాల గురించి ఇలా ముచ్చటించాడు. ‘‘ఇది క్యారెక్టర్ బేస్డ్ కథ. ఫాదర్ ఎమోషన్ మెయిన్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఏదో ఒక మిస్టేక్ చేసే ఉంటారు. వాటిలో మూర్ఖత్వంతో సరిదిద్దుకోలేని తప్పులు చేయొద్దని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. నిజ జీవితంలో బచ్చల మల్లి అనే క్యారెక్టర్ ఉన్న మాట వాస్తవమే. ఊరు గురించి నిలబడిన వ్యక్తి ఆయన. క్యారెక్టర్ వైబ్ చెప్పాలని ఈ టైటిల్ పెట్టాం తప్ప ఇది ఆయన కథ కాదు. కథని ఎమోషనల్‌గా చెప్పాలని, అలాగే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఉండటంతో 90స్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నా.
ఇందులో నరేష్‌ది మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్. ఆయన పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. అమృత అయ్యర్ పాత్ర గుర్తుండిపోతుంది. రావు రమేష్, అచ్యుత్ కుమార్ పాత్రలు కీలకంగా ఉంటాయి. దాదాపు లైవ్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. కథ ప్రెజెంట్ నుంచి పాస్ట్‌కి వెళుతుంది. ఎక్కడా కన్‌ఫ్యూజన్ ఉండదు. డైలాగ్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథను బలంగా నమ్మిన నిర్మాత రాజేష్ దండా గారు చాలా సపోర్ట్ చేశారు”.