
యేటా నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్ కుమార్ స్పీడ్‌కి కరోనా బ్రేక్ వేసింది. రెండు లాక్‌డౌన్స్ కారణంగా థియేటర్లు చాలాకాలం పాటు మూతబడటంతో అతడు నటించిన కొన్ని సినిమాల విడుదల ఆలస్యమయ్యింది. వాటిలో ‘బచ్చన్ పాండే’ ఒకటి. ఫర్హాద్ సామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. సిద్ధార్థ, బాబీ సింహా నటించిన తమిళ సూపర్ హిట్ ‘జిగర్తాండ’కి రీమేక్. కృతీసనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. రిలీజ్ పలుసార్లు వాయిదా పడటంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజవుతుందనే ప్రచారం జరిగింది. ఆ వార్తలకు ఇప్పుడు చెక్ పెట్టింది టీమ్. హోలీ కానుకగా మార్చ్ 18న సినిమా థియేటర్స్‌లో రిలీజవుతుందని ప్రకటించింది. యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ.. అన్నీ ఉన్న తమ సినిమా విడుదలకు హోలీయే సరైన సందర్భం అంటున్నాడు అక్కీ. మొన్నటికి మొన్న ‘సూర్యవంశీ’తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టాడు. రీసెంట్‌గా ‘అత్‌రంగీరే’తో ఓటీటీలోనూ హిట్టు కొట్టాడు. మరి ‘బచ్చన్ పాండే’గా ఎలా ఎంటర్‌టైన్ చేస్తాడో చూడాలి.