అల్లరి నరేష్ హీరోగా సుబ్బు తెరకెక్కించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృత అయ్యర్ హీరోయిన్. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్ చూసి నరేష్‌కి ఫోన్ చేసి కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పా. ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి.
నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ వచ్చేసింది. సుబ్బు నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. ‘మజ్ను’ షూటింగ్ టైమ్‌లో నా వన్ మేన్ ఆర్మీ. ఈ ట్రైలర్ లోనే తను చెప్పదలచుకున్న కథను రివీల్ చేశాడంటే, సినిమాలో ఇంకెంత హానెస్ట్ గా ప్రయత్నించి ఉంటాడో ఊహించగలను. తను బ్లాక్ బస్టర్ కొట్టాలి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే’ అని విష్ చేశాడు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘నటీనటులంతా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సుబ్బు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంతే అద్భుతంగా తీశారు. విశాల్ చంద్రశేఖర్ చాలా కొత్త సౌండ్ ఇచ్చారు. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. సినిమాను గొప్పగా ఆదరించాలని కోరుకుంటున్నట్టు హీరోయిన్ అమృత అయ్యర్ చెప్పింది.
దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ‘నేను రాసిన దాన్ని నరేష్ గారు అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. నేను ఏం చెప్పినా ఆయన చేశారు. ఆ నమ్మకం తప్పకుండా గెలుస్తుంది’ అని చెప్పాడు. ‘ఈ క్రిస్మస్ కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని నిర్మాత రాజేష్ దండ అన్నారు. నటుడు అంకిత్ కొయ్య, దర్శకుడు యోగి తదితరులు పాల్గొన్నారు.