
- పొల్యూషన్తో తిప్పలు పడుతున్నం
- పీసీబీ పట్టించుకోవడం లేదని ఆరోపణ
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల, వెలుగు : పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, ఘాటు వాసనల నుంచి విముక్తి కల్పించాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో స్థానికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లోని ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి, జిన్నారం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న ఎయిర్పొల్యూషన్, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పీసీబీకి ఫిర్యాదు చేశారు.
అయినా సమస్య అలాగే ఉండడంతో ఆదివారం కావ్య ఎవెన్యూ కమ్యూనిటీ హాల్ నుంచి మల్లంపేట రోడ్ లోని సిల్వర్ ఓక్స్ పాఠశాల మీదుగా బాచుపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. ‘పీసీబీ డౌన్ డౌన్ , పీసీబీ జాగో పొల్యూషన్ బాగో, స్వచ్ఛమైన గాలి మా జన్మ హక్కు’ అంటూ నినాదాలు చేశారు. ఫార్మా, కెమికల్ కంపెనీల కారణంగా బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. పీసీబీకి చెప్తే స్పందించడం లేదని, సదరు పరిశ్రమలను మూసివేసేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
గైడ్లైన్స్పాటించకపోతే యాక్షన్
నిజాంపేట్పరిధిలో వాయు కాలుష్యం, దుర్వాసనపై పీసీబీ స్పందించింది. ‘ఇప్పటివరకూ మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఆ ఏరియాను 20 ఏండ్ల క్రితమే ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించారు. కొంతకాలంగా ఆ చుట్టుపక్కల జనాలు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. వాతావరణంలో మార్పులు, గాలులు వీచే దిశ కారణంగా కాలుష్యం, దుర్వాసన వస్తుంటాయి. అలా జరక్కుండా మూడు పూటలా పెట్రోలింగ్ చేస్తున్నాం. పీసీబీ గైడ్ లైన్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.