ముంబై: ఏసీసీ, అంబుజా సిమెంట్ బ్రాండ్ల వాడకాన్ని అదానీ గ్రూప్ కొనసాగిస్తుందని, రెండు సిమెంట్ కంపెనీలను మెర్జ్ చేసే ప్లాన్ ఏదీ లేదని రెండు కంపెనీల సీఈఓగా వ్యవహరిస్తున్న అజయ్ కపూర్ ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో వెల్లడించారు. అంబుజా సిమెంట్స్, ఏసీసీలను స్విట్జర్లాండ్ కంపెనీ హోల్సిమ్ నుంచి అదానీ గ్రూప్ 2022 లో కొనేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ తర్వాత రెండో పెద్ద సిమెంట్ తయారీదారుగా అదానీ గ్రూప్ అవతరించింది. రెండు కంపెనీలను విలీనం చేసే ప్రతిపాదనను అదానీ గ్రూప్ పరిశీలిస్తోందని ఈ ఏడాది మొదట్లో వార్తలు వచ్చాయి.
అంబుజా, ఏసీసీ బ్రాండ్లు యధాప్రకారం కొనసాగుతాయని, ఎలాంటి మార్పులు ఉండవని కూడా కపూర్ చెప్పారు. ఈ రెండు కంపెనీల షేర్ల ధరలూ ఈ ఏడాది జనవరితో పోలిస్తే చాలా తక్కువకే ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ఈ రెండు కంపెనీల షేర్ల రేట్లు కూడా పడిపోయాయి. అంబుజా సిమెంట్స్ షేర్లు 15.7 శాతం, ఏసీసీ షేర్లు 23 శాతం పడ్డాయి. సిమెంట్ బిజినెస్ ఇబిటా మార్జిన్స్‌ను రాబోయే రెండేళ్లలో టన్నుకు రూ. 400–450 దాకా పెంచుకోవాలని చూస్తున్నట్లు కపూర్ వెల్లడించారు.
మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలలో మార్పు, లాజిస్టిక్స్ ప్రాసెస్‌ల మెరుగుదల, ప్రొడక్షన్ ఖర్చు తగ్గింపు వంటి చర్యలతో ఇబిటా మార్జిన్స్ పెంచే ప్రయత్నం సాగుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో 16 మిలియన్ టన్నుల కొత్త కెపాసిటీ యాడ్ చేయాలని ఏసీసీ ప్లాన్ చేస్తోందన్నారు.