న్యూఢిల్లీ: ‘వందే భారత్’ లో మరో రెండు రకాల రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్లీపర్ ట్రైన్ తో పాటు వందే మెట్రో ట్రైన్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి తేనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) వీటిని తయారుచేస్తోంది. ‘‘వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను 2024 మార్చిలో, వందే మెట్రో ట్రైన్ ను 2024 జనవరిలో తీసుకొస్తం. వందే మెట్రోలో 12 కోచ్‌లు ఉంటాయి. దూర ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను, దగ్గరి ప్రయాణాల కోసం వందే మెట్రో రైలును తయారు చేస్తున్నం” అని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.
Also Raed:జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు కర్నాటక డిప్యూటీ సీఎం
‘‘వందే భారత్ స్లీపర్ ట్రైన్లో 16 బోగీలు ఉంటాయి. 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ బోగీలు ఉంటాయి. అవసరమైతే బోగీలను 24 వరకు పెంచుకోవచ్చు” అని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జీఎం అలోక్ కుమార్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లన్నీ సీటర్ కోచ్‌లు ఉన్నవే. వీటిలో రాత్రి వేళల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారడంతో స్లీపర్ కోచ్‌లు తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రాజధాని రైళ్లకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకొస్తోంది. కాగా, మొత్తం 400 వందే భారత్ రైళ్లను తయారు చేసేందుకు రైల్వే శాఖ టెండర్ ఇచ్చింది. వీటిలో 200 సీటర్, మరో 200 స్లీపర్ ట్రైన్లు అని వివరించింది.