హైదరాబాద్, వెలుగు : బీజేపీ ఏదైనా కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిందంటే, ఇంకేదో అంశాన్ని మరుగునపర్చేందుకు ప్రయత్నిస్తోందని మీడియా అర్థం చేసుకోవాలని ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. అదానీ, జైషా అవినీతి అంశాలు బయటపడ్డప్పుడల్లా బీజేపీ ఏదో ఓ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తుందని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అందులో భాగమేనని ఆయన విమర్శించారు. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజల సమస్యల గురించి స్పందించాల్సిన ఆవశ్యకత బీజేపీకి ఏర్పడిందన్నారు.
14 మంది న్యూస్ యాంకర్లను ఇండియా కూటమి బహిష్కరించిందనడం సరికాదని పవన్ అన్నారు. వారు తమ షోల ద్వారా విద్వేషం రెచ్చగొడుతున్నారని, అందులో తాము(ఇండియా కూటమి) భాగస్వామ్యం కాదుల్చుకోలేదని.. అందుకే వారి ప్రోగ్రామ్స్‌కు తమ ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించామన్నారు. ఒకవేళ ఆ 14 మందిలో ఎవరైనా తమ పద్ధతిని మార్చుకుంటే, మళ్లీ వాళ్ల కార్యక్రమాలకు తమ ప్రతినిధులను పంపుతామన్నారు.
Alsoread: జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంపై దాడే వాటికి మేం వ్యతిరేకం: చిదంబరం
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘సనాతన ధర్మంలో తప్పులు, వివక్షలు ఉన్నాయని బీజేపీని నడిపించే సంస్థ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవతే ఒప్పుకున్నారు” అని కామెంట్ చేశారు. చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించినా, ఆక్రమించలేదంటూ బీజేపీ చెప్పడం సైనికులను అవమానించడమేనని పవన్ అన్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలపై సైతం ఆయన స్పందించారు. ఆమె తొలుత బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే అంశంపై, వచ్చే ఎన్నికల్లో గెలవడంపై దృష్టి పెట్టాలంటూ చురకలంటించారు.