వృత్తులు వేరైనా నెత్తురొక్కటే!

రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రంగాల్లో మేమెంతో మాకు అంత. ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీలు చేస్తున్న డిమాండ్. వీటి సాధనకోసం జాతీయ స్థాయి ఉద్యమానికి సన్నద్దం అవుతున్నారు. ఈ రోజు బీసీల హక్కులకు సంబంధించి చాలా కీలకమైన రోజు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది.  ‘మన వృత్తులు వేరైనా నెత్తురంతా ఒక్కటే’ అనే నినాదంతో బిసి సమాజం దృష్టికి కొన్ని ముఖ్య అంశాలు తీసుకురావాలి. దేశంలో 60 కోట్ల మందికి పైగా బీసీ జనాభా ఉంది. గడిచిన 72 ఏళ్లుగా కటిక పేదరికంలో మగ్గుతోంది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకకు నెట్టేయడమైంది. ప్రభుత్వాలు బీసీల పట్ల చాలా నిర్లక్ష్యంతో, పట్టింపు లేని ధోరణితో వ్యవహరించాయి. ఇది చారిత్రకమైన వాస్తవం. సమస్త వృత్తులను అవలంబిస్తూ సమాజానికి సేవ చేసేవాళ్లం మనమే.  తీరా అనుభవించే దగ్గరకొచ్చేసరికి అత్యంత దూరంగా నెట్టివేతకు గురవుతున్నాం మన దేశ బడ్జెట్ 27 లక్షల 87 వేల కోట్లు. ఇందులో 60 కోట్ల మందికి పైగా ఉన్న బీసీలకు దక్కింది కేవలం వెయ్యికోట్లు మాత్రమే.  అప్పుల విషయానికొస్తే 98  లక్షల కోట్లుంది. 60 శాతంగా పైగా ఉన్న బిసీలపై 60 లక్షల కోట్లకు పైగా రుణభారం మోపుతున్నారు. అంటే అప్పులు పంచుకునే దగ్గర సమన్యాయం పాటించి, హక్కుల విషయానికి వచ్చేవరకు వివక్ష పాటిస్తున్న పరిస్థితి. అన్ని విషయాల్లోనూ అన్యాయమే జరుగుతోంది.

బిసిల అభివృద్ధి కోసం మండల్ కమిషన్ 42 సిఫార్సులు చేసింది. దీంట్లో రెండు మాత్రమే అమలు చేశారు. అందులో విద్య, మరోటి ఉద్యోగం. బిసీలు ఎంత మంది, నిధులు ఏ ప్రతిపాదన కేటాయించాలి, ఎట్లా ఖర్చు చేయాలనే విషయాలపై ప్రభుత్వాలకు పట్టింపే లేదు. ఇప్పటివరకు బీసీ జనాభా లెక్కలే లేవు. మన దేశంలో జంతువులకుసైతం లెక్కలున్నాయి. బ్రిటీషు వారి హయాం (1936)లో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగానే ఇంత మంది బిసీలని ఇప్పటికీ చెబుతున్నారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలి. బీసీలకు అందుతున్న అరకొర రిజర్వేషన్లలో క్రీమీలేయర్​ మెలిక పెట్టారు. దీనివల్ల బీసీలకు చాలా నష్టం.

రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రతిభ దెబ్బతింటుందని చెప్పిన బిజెపియే ఇప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోంది. జాట్లు, పటేళ్లు,  కాపులు వంటి వారికీ ఇస్తున్నారు. వీరికి ఇచ్చేటప్పుడు ప్రతిభ గుర్తు రావడం లేదు. ప్రాబల్య కులాలు దొడ్డిదారిలో రిజర్వేషన్ల ఫలాలు మనకు దక్కకుండా చేస్తున్నాయి. అంతేకాదు అతి తక్కువగా ఉన్న అగ్రవర్ణాలు. అతి ఎక్కువ రాజకీయావకాశాలు అనుభవించాయి. ఇప్పుడు రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాయి. వారి జనాభా 10శాతం ఉంటే… వారికి 9.8 శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇస్తున్నారు. పదవులే కాదు… రిజర్వేషన్లుకూడా వారి జనాభాతో పోలిస్తే 0.2 శాతం ఎక్కువే దక్కించుకున్నాయన్న విషయాన్ని గుర్తించాలి.

ఇక, మనకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ వాస్తవానికి జనాభాకు తగ్గట్టుగా లేదు. కేంద్ర ప్రభుత్వ, ఉద్యోగ, విద్యా సంస్థల్లో ఇప్పటి వరకు 8 శాతానికి మించిన ప్రాతినిధ్యం లేదు.  తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారు. చట్ట సభల్లోగానీ, విద్యా, ఉద్యోగాలలోగానీ సరైన ప్రాతినిధ్యం లేదు.  జాతీయ స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లుగా బీసీ వర్గీకరణ చేయాలి. రాయితీల నుండి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా బీసీలంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే తెలంగాణ గడ్డమీద నుండి జాతీయ స్థాయి  బీసీ ఉద్యమాన్ని  ప్రారంభిస్తున్నాయి. ‘మన వృత్తులు వేరైనా నెత్తురంతా ఒక్కటే’నని యావత్ దేశం ముందు ఉంచుదాం.