జిట్టా బాలకృష్ణా రెడ్డి నేపథ్యం ఇదే.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర

హైదరాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి(52) మృతి చెందారు. గత కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‎లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సెప్టెంబర్ 6) ఉదయం తుదిశ్వాస విడిచారు. జిట్టా మరణంపై ఆసుపత్రి వర్గాలు మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జిట్టా మరణ వార్త తెలుసుకుని ఆయన అభిమానులు బంధువులు, తెలంగాణ ఉద్యమకారులు, పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

జిట్టా నేపథ్యం

 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జిట్టా.. 14 డిసెంబర్ 1972న  యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. 1993లో డివీఎం డిగ్రీ & పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌లో పూర్తి చేశాడు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర

 చిన్నప్పటి నుండే చురుగ్గా ఉండే జిట్టా.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతోన్న అన్యాయాన్ని చూసి చలించిపోయాడు. తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాన్ని ఎదురించేందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోకి దిగాడు. యువజన సంఘాలని ఏకం చేసి ఉద్యవ్వెత్తునమం ఉటం ఎగిసిపడలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్విర్వామ కృషి చేశాడు. ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిల్చి ఉద్యమం ఉధృతం కావడంలో కీలకంగా వ్యవహరించారు. 

ఎన్నికల్లో పోటీ

 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పొత్తులో భాగంగా భువనగిరి స్థానం టీడీపీకి దక్కడంతో ఆయన బీఆర్ఎస్‎ను విడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‏లో జాయిన్ అయ్యారు. జగన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేక  విధానాలు అవలంభిస్తుండటంతో వైసీపీకి రాజీనామా చేసి.. సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు.  అనంతరం నల్లగొండ-, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిట్టా తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 

అయితే, ముక్కుసూటిగా ఉండే జిట్టా పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కాంగ్రెస్లో పార్టీలో చేరారు. కానీ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి సొంతగూటికి (బీఆర్ఎస్) చేరుకున్నారు. గతేడాది నవంబర్‪లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుండి భువనగిరి పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతారని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ సిట్టింగ్‍లకే టికెట్లు ఇవ్వడంతో జిట్టాకు నిరాశ ఎదురైంది. అనంతరం ఆయన అనారోగ్యానికి గురి కావడం, ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళ ( సెప్టెంబర్ 6) ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జిట్టా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.