- నిధుల్లేక ఆగిన బ్యాంబూ మిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెదురు వనాలను (బ్యాంబూ) ఏర్పాటు చేసేందుకు చేపట్టిన నేషనల్ బ్యాంబూ మిషన్ ముందుకు సాగడం లేదు. రాష్ట్రం తన వంతు నిధులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. వెదురులంకలను డెవెలప్ చేయడానికి కేంద్రం 2018లో ఈ మిషన్‌ను చేపట్టింది. వెదురు సాగును పెంచడం, వెదురు ఆధారిత చిన్న ఇండస్ట్రీలను ఎంకరేజ్చేయడం ఈ ప్రాజెక్ట్ టార్గెట్. వెదురు వనాల కోసం రాష్ట్రంలో రూ.11.14 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత దాన్ని రూ.12.76 కోట్లకు పెంచారు. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వాలి. బ్యాంబూ మిషన్ కోసం కేంద్రం నిధులు కేటాయించినా, రాష్ట్ర సర్కారు వాటా రూ.5.10 కోట్లను ఇంత వరకు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. వెదురు సాగును పెంచడం, ఈ ప్రొడక్టులను మార్కెట్ చేయడం ద్వారా రైతులకు, పెంపకందారులకు ఉపాధి కల్పించడం కూడా నేషనల్ బ్యాంబూ మిషన్ టార్గెట్లలో ఒకటి. రైతులను వెదురు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేసే బాధ్యతను ఉద్యానశాఖకు అప్పగించింది. హార్టికల్చర్‌శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించి పొలాల గట్ల వెంట వెదురు మొక్కలు పెంచాలని నిర్ణయించింది. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయొచ్చని కేంద్రం ఆదేశించింది.
వెదురుకు రాష్ట్ర అడవులు అనుకూలం..
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ అడవులు వెదురు పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. పొలాల వెంట ఫెన్సింగ్‌గా కూడా వీటిని పెంచుకోవచ్చు. వెదురు మొక్క ఒకసారి నాటితే దశాబ్దాల తరబడి దిగుబడి వస్తుంది. గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల్లో ప్లాస్టిక్‌కు బదులు వెదురు ఉపయోగించవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లలోనే వెదురు పెంచుతారు. మన రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున వెదురు పెంచుకోవచ్చు. వెదురు చెట్లను నరకడానికి, తరలించడానికి అటవీశాఖ అనుమతి తీసుకోవాలనే నిబంధనను కేంద్రం తొలగించింది.
వెదురు ఫర్నిచర్‌కు డిమాండ్
రాష్ట్రంలో బ్యాంబూ ఫర్నిచర్‌కు మంచి డిమాండ్ ఉంది. సోఫాలు, టీపాయ్‌లు, హ్యాంగింగ్ చైర్లతోపాటు కర్టెన్లు, క్యాండిల్ స్టాండ్లు, టోపీలు, పూలకుండీలు, దీపాలు తదితర వస్తువులను వెదురుతో తయారు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెదురు ఉత్పత్తులు తయారు చేసే వారికి ట్రైనింగ్ ఇప్పించి, స్కిల్‌ను పెంచితే వెదురు వాడకం బాగా పెరుగుతుందని, ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
నెరవేరని లక్ష్యం
రైతులు వెదురును సాగుచేసేందుకు ఒక్కో వెదురు మొక్కకు రూ.240 చొప్పున ఇన్సెంటివ్ అందించాలని ఉద్యానవనశాఖ నిర్ణయించింది. వెదురు మొక్కకు రూ.35 నుంచి రూ.40 వరకు ఖర్చవుతుంది. గుంతలు తవ్వడం, ఎరువులు వేయడం వంటి పనులకు రూ.240 వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదటి ఏడాది 50% రాయితీ , రెండవ ఏట 30%, మూడో సంవత్సరం 20% చొప్పున రైతుకు హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ద్వారా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంబూ ప్రాజెక్టులను స్టడీ చేయడానికి ఆఫీసర్లు చైనా కూడా వెళ్లారు. ట్రైనింగ్ ప్రోగ్సామ్స్కు అటెండ్ అయ్యారు. రాష్ట్రంలో 8లక్షల 30వేల వెదురు మొక్కలను నాటాలని హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకున్నా, రాష్ట్ర సర్కారు సహకారం లేక పనులు ముందుకు కదలడం లేదు.
ఇవి కూడా చదవండి..
అచ్చంపేట టు హైదరాబాద్.. రేవంత్ పాదయాత్ర
మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట
గవర్నర్ లెటర్‌తో సర్కారులో కదలిక