- వైరస్, ఫంగస్ వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు కూడా..
- ఐఐసీటీ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని మురుగునీటిలో మందులకు లొంగని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు పెరుగుతున్నట్టు ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాజలీ) సైంటిస్టులు గుర్తించారు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగం, మానవ వ్యర్థాలను మురుగునీటిలోకి వదలడం అందుకు కారణమని వెల్లడించారు. దీనిని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్ అంటారని తెలిపారు.
ఇది అత్యంత ప్రమాదకరమని వెల్లడించారు. ఈ హానికారక యాంటీ మైక్రోబియల్ జన్యువులపై ఐఐసీటీ సైంటిస్టులు యామిని, వెంకట మోహన్ బృందం అధ్యయనం చేసింది. ‘టెంపోరల్ డైనమిక్స్ అండ్ పెర్సిస్టెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ జీన్స్ టు బ్రాడ్ స్పెక్టమ్ యాంటీ బయాటిక్స్ ఇన్ అర్బన్ కమ్యూనిటీ’ అనే అంశంపై పరిశోధనలు సాగించింది.
తార్నాక, నాచారం, లాలాగూడ ప్రాంతాల్లో మురుగునీటిపై పరిశోధనలు
సిటీలోని ముఖ్య ప్రాంతాలైన తార్నాక, నాచారం, లాలాగూడ ప్రాంతాల్లోని మురుగునీటిలో సైంటిస్టుల బృందం పరిశోధనలు జరిపింది. ఈ మూడు ప్రాంతాల్లోని మురుగు నీటి శాంపిళ్లను సేకరించి అందులో పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) విధానంలో విశ్లేషించింది. డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు పరిశోధనలు సాగించింది.
యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ జన్యువుల వైవిధ్యాలను అంచనా వేయడానికి ప్రతినెలా మురుగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. అందులో123 రకాల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జన్యువులు,13 జన్యు మూలకాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ పరీక్షల్లో 52 శాతం నుంచి 61 శాతం వరకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కారకాలు ఉన్నట్టు వెల్లడించింది.
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే....
యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్స్ సహా యాంటీ మైక్రోబియల్స్ అనేవి చికిత్సకు ఉపయోగించే మందులు. మానవులు, జంతువులు, మొక్కలలో అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని అధికంగా వాడితే శరీరం మందులకు ప్రతిస్పందించదు. దీంతో యాంటీ మైక్రోబియల్రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సంభవిస్తుంది. దీంతో అంటువ్యాధుల నివారణకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది.
వ్యాధి వ్యాప్తి, తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని, కొన్ని సందర్భాల్లో మరణాల ప్రమాదాన్ని పెంచుతాయని సైంటిస్టులు తమ పరిశోధనలో వెల్లడించారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌కు కారణమవుతున్న కారకాల వినియోగాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం మేరకే యాంటీబయాటిక్స్ వినియోగించాలని, వాటి వల్ల కలిగే లాభ, నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు సూచించారు.