లిస్టులో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంకులు కూడా
బ్యాంకుల లోన్లలో పెరిగిన ఓవర్ డ్యూల వాటా
ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్ల టార్గెట్ ధర తగ్గించిన యూబీఎస్
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తో సహా ఏడు ప్రభుత్వ బ్యాంకుల మొండిబాకీలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్ నాటికి పీఎన్‌బీ నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) బ్యాంక్ మొత్తం లోన్లలో 1.98 శాతం ఉంది. అంటే ఇంత మొత్తం లోన్లు ఇంకా రికవరీ కాలేదని అర్థం. మిగిలిన ప్రభుత్వ బ్యాంకుల కంటే పీఎన్‌బీ ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పీఎన్‌బీ తర్వాత ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ టాప్‌లో ఉంది.
ఈ బ్యాంక్ నెట్ ఎన్‌పీఏల రేషియో జూన్ నాటికి 1.95 శాతంగా రికార్డయ్యింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ఎన్‌పీఏలు 1.65 శాతంగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ఎన్‌పీఏలు 1.58 శాతంగా ఉన్నాయి. 1.44 శాతం నెట్ ఎన్‌పీఏల రేషియోతో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ వీటి తర్వాత స్థానాల్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నెట్ ఎన్‌పీఏల రేషియో 0.78 శాతంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ఎన్‌పీఏల రేషియో 0.71 శాతంగా ఉన్నాయి.
దైనా లోన్ అసలు లేదా వడ్డీ పేమెంట్స్ 90 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు ఓవర్ డ్యూలో ఉంటే అటువంటి లోన్లను ఎన్‌పీఏలుగా పిలుస్తారు. అంటే బ్యాంకులు ఇచ్చిన అప్పులను బారోవర్లను తిరిగి చెల్లించక పోతే అవి మొండిబాకీలుగా మారతాయి.
బ్యాంకులకు పర్సనల్ లోన్ల గండం
కరోనా సంక్షోభం తర్వాత ఇండియన్ బ్యాంకులు పర్సనల్ లోన్ల వంటి అన్‌సెక్యూర్డ్ లోన్లు ఇవ్వడం పెంచాయి. లోన్ తీర్చే సామర్ధ్యం తక్కువగా ఉన్న వారికీ బ్యాంకులు బాగా లోన్లు ఇచ్చాయని యూబీఎస్ వెల్లడించింది. దీంతో బ్యాంకులిచ్చిన మొత్తం అన్‌సెక్యూర్డ్ లోన్లలో ఓవర్ డ్యూ (వడ్డీ లేదా అసలు చెల్లించని లోన్లు) పెరిగాయని తెలిపింది. బ్యాంకుల ఇష్యూ చేసిన క్రెడిట్ కార్డుల ఔట్‌స్టాండింగ్ ( బకాయిలు) ఈ ఏడాది ఆగస్టు 25 నాటికి రూ.2.18 లక్షల కోట్లకు పెరిగింది.
అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌కి ఈ నెంబర్ రూ.1.68 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. ఇదే టైమ్‌లో పర్సనల్ లోన్ల ఔట్‌స్టాండింగ్ 26 శాతం ఎగసింది. అదే విధంగా బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో ఓవర్‌డ్యూ అయిన లోన్ల వాటా 2022–23 ఆర్థిక సంవత్సరంలో 23 శాతానికి పెరిగాయి.
2018–19 లో లోన్లలో వీటి వాటా 12 శాతంగా రికార్డయ్యింది. ఒకటి కంటే ఎక్కువ రిటైల్ లోన్లు ఉన్న వారి సంఖ్య కూడా పెరిగింది. బ్యాంకుల నుంచి రిటైల్ లోన్లు తీసుకున్న వారిలో ఒకటి కంటే ఎక్కువ లోన్లు తీసుకున్నవారి వాటా కిందటి ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతానికి చేరుకుంది. 2017–18 లో వీరి వాటా 3.9 శాతంగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లకు యూబీఎస్ ‘సెల్’ రేటింగ్ ఇచ్చింది.
యాక్సిస్ బ్యాంక్‌పై ‘నూట్రల్’ రేటింగ్ ఇచ్చింది. ఇస్తున్న అప్పులపై చేసే ఖర్చు పెరుగుతాయని, అందుకే వీటి రేటింగ్‌ను గతంలో ఇచ్చిన ‘బై’ రేటింగ్ నుంచి తగ్గించామని పేర్కొంది. అంతేకాకుండా ఎస్‌బీఐ షేరు టార్గెట్ ధరను గతంలో ఇచ్చిన రూ.740 నుంచి రూ.530 కి, యాక్సిస్ బ్యాంక్ షేరుపై టార్గెట్ ధరను రూ. 1,150 నుంచి రూ. 1,100 కి కట్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంకుపై సానుకూలంగా ఉంది.