
ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. ఆగడాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో ఓ యువకుడు అత్యాచారయత్నానికి వడిగట్టాడు. ఈ ఘటన విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ దుండగుడు ఆదివారం రాత్రి ( మార్చి 23 ) అత్యాచారయత్నం చేశాడు.. దీంతో కదులుతున్న ట్రైన్‌లో నుంచి బాధితురాలు ఒక్కసారిగా దూకేసింది.. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన ఆ యువతిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
బాధితురాలు మేడ్చల్ లో ప్రైవేట్ జాబ్ చేస్తుంది. తన ఫోన్ చెడిపోవడంతో రిపేర్ చేయించుకుని.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు ఎంఎంటీఎస్ ట్రైన్ లో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మహిళల కోచ్ లో బాధితురాలు ఒక్కరే ఉండటాన్ని గమనించిన ఓ యువయుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమె తప్పించుకునే క్రమంలో కదిలే రైలు నుంచి దూకింది. ఈ ఘటన కొంపల్లి బ్రిడ్జి వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.