- ఎయిర్‌షోకు 13 లక్షల మంది
- తొక్కిసలాట..ఐదుగురు మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) షోలో విషాదం జరిగింది. ఊపిరాడక నలుగురు, గుండెపోటుకు గురై మరొకరు చనిపోయారు. ఎయిర్ షోకు ఊహించిన దాని కన్నా భారీ సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. దాదాపు 13 లక్షల మంది వచ్చినట్లు అంచనా. ఒక్క చెన్నై నుంచే కాకుండా సిటీ పరిసర ప్రాంతాల నుంచీ సందర్శకులు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు షో పూర్తయింది. షో ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అందరూ ఇబ్బంది పడ్డారు.
బీచ్ కు సమీపంలో ఉన్న లైట్ హౌస్ మెట్రో స్టేషన్, చెన్నై ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ లో నిలబడడానికి కూడా చోటులేనంతగా జనం చేరుకున్నారు. కొంతమంది రిస్కు చేసి జర్నీ చేయగా.. మరి కొంతమంది స్టేషన్లలోనే గడిపారు. తర్వాత అన్నా స్క్వేర్ లోని బస్టాప్ కు చేరుకున్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది.
దీంతో వేడి వాతావరణానికి తట్టుకోలేక చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పరిస్థితి ఒక దశలో తొక్కిసలాటకు దారితీసేలా కనిపించింది. అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి స్పృహతప్పి పడిపోయిన 250 మందిని సమీపంలోని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఎంతో కష్టంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసి అంబులెన్సులను తరలించారు. మెరీనా బీచ్ నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ నత్తనడకన సాగింది. కొన్ని చోట్ల వాహనాలు స్తంభించిపోయాయి.