- ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ దూరం
- వ్యక్తిగత కారణాలతో టీమ్ నుంచి తప్పుకున్న స్టార్ బ్యాటర్
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆట చూడాలని ఆశించిన హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను టీమ్ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. కోహ్లీ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చే ప్లేయర్ పేరును త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ‘వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకుంటానని బీసీసీఐని కోహ్లీ రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయమై ముందుగానే కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లతో విరాట్ మాట్లాడాడు.
దేశానికి ఆడటమే తన ప్రాధాన్యత అని చెప్పాడు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలు, తప్పనిసరి పరిస్థితుల్లో తాను జట్టును వీడాల్సి వస్తోందని తెలిపాడు. బీసీసీఐ అతని నిర్ణయాన్ని గౌరవించింది. బోర్డుతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ స్టార్ బ్యాటర్‌కు బాసటగా నిలుస్తుంది. టెస్ట్ సిరీస్‌లో మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు మిగతా ఆటగాళ్ల సామర్థ్యాలపై విశ్వాసం ఉంచింది’ అని బోర్డు సెక్రటరీ జై షా పేర్కొన్నారు.
కాగా, ఈ సమయంలో విరాట్ కోహ్లీ ప్రైవసీని గౌరవించాలని, అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు సృష్టించవద్దని మీడియా, ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న విరాట్ సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. తను అయోధ్యకు కూడా వెళ్లలేదు.కాగా, కోహ్లీ చివరగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. తర్వాత అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20కి కూడా వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ చివరి రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.
రజత్, సర్ఫరాజ్ మధ్య పోటీ!
కోహ్లీ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చేందుకు యంగ్ స్టర్స్ రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ ముందంజలో ఉన్నారు. ఇండియా–ఎ తరఫున ఈ ఇద్దరూ సత్తా చాటుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికార టెస్టులో పటీదార్ 151 రన్స్ చేయగా.. సర్ఫరాజ్ ఫిఫ్టీతో మెరిశాడు. మరోవైపు వెటరన్ చతేశ్వర్ పుజారా పేరు కూడా వినిపిస్తోంది. రంజీ ట్రోఫీలో పుజారా డబుల్ సెంచరీతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.
జోరుగా ప్రాక్టీస్.. బ్యాటింగ్‌పై ఫోకస్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు కోసం ఇండియా ప్రాక్టీస్ స్పీడు పెంచింది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం ఉదయం సెషన్‌లో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కోహ్లీ, అయోధ్యకు వెళ్లిన జడేజా తప్ప మిగతా ప్లేయర్లంతా దాదాపు మూడున్నర గంటల పాటు చెమటలు చిందించారు. కెప్టెన్ రోహిత్, రాహుల్, గిల్ బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టారు. టీమ్ ఉదయం 9.30కి స్టేడియానికి చేరుకుంది.
హెడ్ కోచ్ ద్రవిడ్, రోహిత్ 20 నిమిషాల పాటు చర్చించుకోగా మిగతా ప్లేయర్లు స్టేడియంలో వార్మప్ చేశారు.
జైస్వాల్, అశ్విన్ మొదటగా నెట్స్‌లోకి వచ్చారు. జైస్వాల్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ నుంచి త్రో డౌన్స్ ఎదుర్కోగా.. అశ్విన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాటింగ్ చేశాడు. తర్వాత బంతి అందుకున్న అశ్విన్.. అక్షర్‌తో కలిసి కెప్టెన్ రోహిత్‌కు బంతులు విసిరాడు. ఈ ఇద్దరితో పాటు ఓ లెగ్ స్పిన్నర్ (నెట్ బౌలర్) బౌలింగ్‌ను ఎదుర్కొంటూ రోహిత్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇద్దరు స్పిన్నర్లతో పాటు బుమ్రాను ఫేస్ చేసిన హిట్ మ్యాన్ పవర్‌ఫుల్ డ్రైవ్స్, పుల్ షాట్లు కొట్టాడు.
అయితే, అక్షర్ వేసిన ఓ బాల్ అతని ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. కాసేపటికి రోహిత్, జైస్వాల్ రెస్ట్ తీసుకోగా రాహుల్, గిల్ నెట్స్‌లోకి వచ్చి ప్రాక్టీస్ చేశారు. ఈ ఇద్దరూ మంచి స్ట్రోక్స్ కొడుతూ కనిపించారు. కీపర్ కేఎస్ భరత్ మాత్రం ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డాడు. కొంత గ్యాప్ తర్వాత రెండోసారి నెట్స్‌లోకి వచ్చిన రోహిత్ ఈసారి లోకల్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఈసారి బంతిని గాల్లోకి లేపకుండా గ్రౌండ్ షాట్స్, కట్ షాట్స్ కొట్టాడు. కొత్త కీపర్ జురెల్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. మధ్యాహ్నం సెషన్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.