హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాకు మరో బిగ్ షాక్ ఎదురైంది. ఇంగ్లండ్ తో జరగబోయే రెండో టెస్టుకు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. జడేజా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా కాలుకు గాయమైంది. జోరూట్ వేసిన 39వ ఓవర్‌లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి జడేజా రనౌటయ్యాడు. పరుగు కోసం వేగంగా పరిగెత్తిన క్రమంలో జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. దీంతో అతను ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. జడేజా తొడకండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
రెండో టెస్టు కోసం అతడు జట్టు వెంట విశాఖపట్నానికి వెళ్లిన అక్కడి నుంచి జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)కి తరలిస్తారని సమాచారం. భారత్ ఓటమి తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విలేకరులు జడేజా గాయం గురించి ప్రశ్నించగా.. ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు.
ఉప్పల్ టెస్టు మ్యాచ్ లో జడేజా తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఒక వేళ జడేజా రెండో టెస్టు ఆడకపోతే అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 2024 ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.