
- ఈబీ5 వీసాల కటాఫ్ తేదీ 6 నెలలు వెనక్కి
- 2019, మే1కి ముందు అప్లై చేసుకున్నోళ్లకే చాన్స్
- ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ
- ఈబీ1, 2, 3 వీసాల కోసమూ భారీగా వెయిటింగ్ పీరియడ్
వాషింగ్టన్: వీసాలపరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇండియన్లను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈబీ (ఎంప్లాయిమెంట్ బేస్డ్) వీసాలతో గ్రీన్ కార్డులు పొందాలని ఎదురు చూస్తున్నవారికి మరింత వెయిట్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఈబీ5(ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్) కేటగిరీలో వీసాను, ఆ వీసా ఆధారంగా గ్రీన్ కార్డును జారీ చేస్తారు. అయితే, ఇప్పటివరకూ ఈబీ5 వీసాకు 2019, నవంబర్1 కటాఫ్ తేదీగా ఉండగా.. దానిని ఆరు నెలలు వెనక్కి(2019, మే1కి) జరిపారు.
అంటే.. ఇప్పటివరకూ 2019, నవంబర్1కి ముందు అప్లై చేసుకున్న వాళ్ల పేర్లను ఈబీ5 వీసా వెయిటింగ్ లిస్టులో పెట్టగా.. ఇప్పుడు 2019, మే1కి ముందు అప్లై చేసుకున్నవాళ్ల పేర్లు మాత్రమే ఈ లిస్టులో ఉంటాయి. దీంతో ఈ కటాఫ్ తేదీ తర్వాత అప్లై చేసుకున్నవాళ్లు వెయిటింగ్ లిస్టులోకి వచ్చేందుకే మరింత సమయం పట్టనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం మే, 2025 వీసా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈబీ 5 కేటగిరీలో చైనాకు కూడా అమెరికా షాక్ ఇచ్చింది. కటాఫ్ తేదీని 2014, జనవరి 22(సుమారు 2.5 ఏండ్లు వెనక్కి)కు జరిపింది. ఈబీ 3 కేటగిరీలో ఇండియాకు కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ (ఏప్రిల్15, 2013 వరకు ముందుకు జరిగింది).
ఈబీ 3 కేటగిరీలో స్వల్ప ఊరట
కేటగిరీల పరంగా చూసుకుంటే.. ఈబీ 1లో గత నెలతో పోలిస్తే మే బులిటెన్‌లో కటాఫ్ తేదీలో ఎలాంటి మార్పు లేదు. చైనా విషయంలోనూ అమెరికా అదే వైఖరి అవలంబించింది. ఇతర దేశాలు మాత్రం ‘కరెంట్’గా ఉన్నాయి. అంటే.. వీసాలు వెంటనే లభిస్తాయి. ఈబీ 2 (అడ్వాన్స్ డిగ్రీ ప్రొఫెషనల్స్) కేటగిరీలో ఇండియా విషయంలో గత నెలతో పోలిస్తే (2013, జనవరి 1) కటాఫ్ తేదీ కాస్త ముందుకొచ్చింది.
చైనా విషయంలో మార్పు లేదు. ఇతర దేశాల విషయంలోనూ కటాఫ్ తేదీ ముందుకొచ్చింది. ఈబీ 3 (స్కిల్డ్ వర్కర్స్/ప్రొఫెషనల్స్) కేటగిరీలో ఇండియా విషయంలో గత నెలతో పోలిస్తే కటాఫ్ తేదీ సుమారు 2 వారాలు(2013, ఏప్రిల్ 15) ముందుకొచ్చింది.