ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి: బదావత్ సంతోష్

మంచిర్యాల, వెలుగు: నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భరోసా కల్పించేందుకు రామగుండం పోలీస్​ కమిషనర్​ రెమా రాజేశ్వరి, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ కలిసి సీఆర్​పీఎఫ్, పోలీసు బలగాలతో మంగళవారం సాయంత్రం మంచిర్యాలలో ఫ్లాగ్​మార్చ్​నిర్వహించారు.

ఐబీ చౌరస్తాలో ప్రారంభించి వెంకటేశ్వర థియేటర్, మార్కెట్ రోడ్, బెల్లంపల్లి చౌరస్తా, బస్టాండ్ మీదుగా జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ వరకు ఫ్లాగ్​మార్చ్ కొనసాగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ఇప్పటివరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 కేంద్ర బలగాలు వచ్చాయని, ఇందులో మహిళా బలగాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.