
- జోరుగా బడిబాట కార్యక్రమం
- స్టూడెంట్లకు బుక్స్, యూనిఫాం అందజేత
నెట్వర్క్, వెలుగు: గ్రామాల్లో బడిబాట కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ టీచర్లు, అధికారులు, రాజకీయ నేతలు పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. సర్కారు బడుల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తోందని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం ఖానాపూర్ మండలం మస్కాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కార్ బడుల్లో టీచర్లు విద్యనందించి విద్యార్థులు ఎదుగుదలకు కృషి చేస్తున్నారని అన్నారు.
పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ సన్మానించారు. డీఈవో రవీందర్ రెడ్డి, ఎంపీపీ అబ్దుల్ మోహిద్, తహసీల్దార్ శివ రాజ్, ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే మనిషి జీవితంలో గొప్ప మార్పు వస్తుందని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హాజీపూర్ మండలం ముల్కల్ల, రాపల్లి స్కూళ్లలో నిర్వహించిన బడిబాటలో పాల్గొన్నారు.
డీఈవో ఎస్.యాదయ్య, డీఆర్డీవో కిషన్‌తో కలిసి స్టూడెంట్లకు యూనిఫామ్స్, బుక్స్ అందజేశారు. గవర్నమెంట్ స్కూళ్లలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థులకు మున్సిపల్కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. నిర్మల్పట్టణంలోని ఈద్ ప్రభుత్వ పాఠశాలలో ఆర్డీఓ రత్నజ్యోతి, డీఈఓ రవీందర్ రెడ్డి విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
విద్యతోనే మంచి భవిష్యత్
విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. ఎమ్మెల్యే పాయల్శంకర్తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ అన్నారు. రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ఎమ్మెల్యే బొజ్జు పటేల్అన్నారు.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. మండల పరిషత్‌పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు, బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో జివాకర్ రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నేరడిగొండ మండలంలోని వడూర్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలు , యూనిఫామ్ లు అందజేశారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన జరుగుతోందని తెలిపారు.