
నింగ్బో (చైనా): ఇండియా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో నిరాశపర్చింది. గురువారం జరిగిన విమెన్స్ ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ 17వ ర్యాంకర్ సింధు 12–21, 21–16, 16–21తో వరల్డ్ నాలుగో ర్యాంకర్, మూడోసీడ్ అకానె యమగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన ఇండియన్ ప్లేయర్ రెండో గేమ్‌లో నెగ్గింది. కానీ నిర్ణాయక మూడో గేమ్‌లో యమగుచి కొట్టిన క్రాస్ కోర్టు షాట్లకు సరైన బదులు ఇవ్వలేకపోయింది. బలమైన స్మాష్‌లు సంధించినా నెట్‌కు తాకడం ఇబ్బందిగా మారింది.
మెన్స్ సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ 14–21, 17–21తో వరల్డ్ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. సుదీర్ఘమైన ర్యాలీలు, స్మాష్‌లతో చెలరేగిన నరోకా 43 నిమిషాల్లోనే రజావత్ ఆట కట్టించాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ 21–19, 13–21, 16–21తో కున్లావుట్ విటిడ్సార్న్ (థాయ్‌లాండ్) చేతిలో చిత్తయ్యాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 12–21, 21–16, 21–18తో యి హంగ్ వీ–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్‌తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో అశిత్ సూర్య–అమృతా ప్రముతేశ్ 11–21, 14–21తో టాప్‌సీడ్ జియాంగ్ జెన్ బాంగ్–వీ యా జిన్ (చైనా) చేతిలో ఓడారు. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్ అంశకరుణన్ – రూబన్ కుమార్ రెతినాసబాపతి 15–21, 14–21తో అరోన్ చియా–వూయి యిక్ సోహ్ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు.