
మకావు : ఇండియా యంగ్ షట్లర్లు ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్.. మకావు ఓపెన్ సూపర్–300 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన విమెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో ట్రీసా–గాయత్రి 21–12, 21–17తో ఆరోసీడ్ సు యిన్ హుయ్–లిన్ జిహ్ యున్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. ఈ సీజన్‌లో ఇండియన్ జోడీకి ఇది రెండో సెమీస్. ఇంతకుముందు సింగపూర్ ఓపెన్‌లో లాస్ట్–4 స్టేజ్‌కు చేరారు. 39 నిమిషాల మ్యాచ్‌లో ట్రీసా–గాయత్రికి మంచి ఆరంభం దక్కింది.
8–4తో తొలి గేమ్‌ను మొదలుపెట్టి 11–7తో ముందుకెళ్లారు. చివరివరకు అదే జోరును కొనసాగించి ఈజీగా గేమ్ గెలిచారు. రెండో గేమ్‌లో ఒక్కో పాయింట్‌తో ఇరుజట్లు ముందుకెళ్లాయి. అయితే బలమైన స్మాష్‌లతో చెలరేగిన ఇండియన్ ద్వయం 18–14తో లీడ్‌లోకి వచ్చి దాన్ని ఆఖరి వరకు కాపాడుకుంది. మెన్స్ క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 12–21తో ఎంగ్ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో పరాజయం చవిచూశాడు.