కేసీఆర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు సరికావు : బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌‌పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్‌‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు.  ఆదివారం పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ సాధించడమే కాదు పదేళ్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపిన కేసీఆర్‌‌ను బొందపెడతామని మాట్లాడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌‌, బీఆర్‌‌ఎస్ నేతలపై విమర్శలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  420 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగే నల్గొండ పార్లమెంట్‌  సమావేశంలో  కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మది భిక్షం, జిల్లా నాయకులు బండారు రాజా పాల్గొన్నారు.