- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆరోపణలు
- రాజకీయ కక్ష సాధింపు చర్యలేనన్న హసీనా కొడుకు
వాషింగ్టన్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు ఆ దేశం ఆరోపించింది. విద్యార్థుల ఉద్యమంతో ఆమె ప్రస్తుతం ఇండియాలో ప్రవాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమెను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) ద్వారా ఇండియాకు డిప్లామాటిక్నోట్ పంపించింది.
అలాగే అవామీ లీగ్(ఏఎల్) ప్రభుత్వంలో మంత్రులు, పలువురు అధికారులకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఆరోపణలు పూర్తిగా బోగస్ అని హసీనా కొడుకు ఆమెరికాలో ఉండే సాజిబ్ వాజెద్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నకోబడని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. నచ్చిన వారిని నియమించి.. న్యాయవ్యవస్థను, దర్యాప్తు సంస్థలను ఆయుధంగా మార్చి అవామీలీగ్
నాయకత్వంపై ప్రయోగిస్తున్నదని విమర్శించారు.
10 బిలియన్లలో ప్రాజెక్టులో 5 బిలియన్ల అవినీతి
ఢాకాకు 160 కి.మీ దూరంలో రూప్పూర్ వద్ద రష్యా ప్రభుత్వరంగ సంస్థ రోసాటమ్ కార్పొరేషన్ ద్వారా బంగ్లాదేశ్లో తొలి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు పనులు 2015లో ప్రారంభించారు. 10 బిలియన్ డాలర్ల ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇండియాకు చెందిన పలు కంపెనీలు కూడా పార్ట్నర్స్గా ఉన్నాయి. ఇందులో షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆఫ్ షోర్ అకౌంట్ల ద్వారా డబ్బును షేక్ హసీనా, సాజిబ్ వాజెద్, హసీనా మేనకోడలు, బ్రిటీష్ ట్రెజరీ మంత్రి తులిప్ సిద్దిక్కు అందజేసినట్టు బంగ్లాదేశ్ యాంటీ కరెప్షన్ కమిషన్ ఆరోపిస్తున్నది. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నది. అయితే ఈ ఆరోపణలను రోసాటమ్ కార్పొరేషన్ ఖండించింది. తమ ప్రతిష్ట కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.