
- వెంకట్రామ్రెడ్డి సీఎం కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ అయ్యిండు
- నేను సీఎం అయితే బహుజనులు అయినట్లే..
- బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సిద్దిపేట టౌన్, రూరల్ వెలుగు : సిద్దిపేట గడ్డ మీద నుండి బహుజన దండయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేటలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పుల్లూరు ఉమేశ్ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘బీఆర్ఎస్ లో బహు జనులు జెండాలు మోసేందుకే పనికొస్తారా? రాజ్యాధికారానికి పనికిరారా?’ అని ప్రశ్నించారు. ఈ సమావేశంతో దొరల గడీల మీద బహుజన దండయాత్ర ప్రారంభిస్తున్నామని, ఆనాటి దొరల మూలాలు ఈనాటి దొరలకు ఉన్నాయని, నారాయణ్‌ఖేడ్ లో మూడు కుటుంబాలే 50 ఏండ్లుగా ఏలుతున్నాయన్నారు. తెలంగాణ కోసం మనమందరం త్యాగాలు చేస్తే కేసీఆర్ ఒక్కడే సీఎం అయ్యాడని, ప్రవీణ్ కుమార్ సీఎం అయితే బహుజనులంతా అయినట్లేనని, బహుజన పార్టీ కండువా వేసుకొని, ప్రగతి భవన్ లో చాయ్ తాగుదామన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్ కోసం సొంతంగా మార్కూక్ మండలాన్నే ఏర్పాటు చేసుకుని, అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టించి, ఫాంహౌజ్ కు24 గంటల కాపలా పెట్టుకున్నాడన్నారు. సిద్దిపేట కలెక్టర్ గా పని చేసిన వెంకట్ రామిరెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ అయ్యాడని, హైదరాబాద్ లోని కోకాపేటలో ఆయన సంస్థ వందల కోట్లు పెట్టి భూములు కొన్నదన్నారు. బహుజనుల గురించి హరీశ్ రావు, కేటీఆర్ లు పట్టించుకోరని, రాబోయే రోజుల్లో వారి ఫామ్ హౌసుల్లో నీలి జెండాలు పాతుదామని, కేసులు పెట్టినా భయపడవద్దని కార్యకర్తలకు సూచించారు.
బహుజనులు ఎన్నికల్లో నిలబడొద్దా..
సుర్యాపేటలో ఎన్నో ఏండ్లుగా మంత్రి జగదీశ్ రెడ్డి వెంట తిరిగిన జానయ్య ఎమ్మెల్యేగా నిలబతాననగానే రాత్రికి రాత్రే 70కి పైగా అక్రమ కేసులు పెట్టించి, ఆయనను అణగదొక్కారని, దొరల రాజ్యంలో బహుజనులు ఎన్నికల్లో నిలబడొద్దా అని ప్రశ్నించారు. బహుజనులు ఏ పార్టీలో ఉన్నా వారికి అండగా ఉంటానన్నారు. లిక్కర్ స్కాం లో 100 కోట్ల ముడుపులు పుచ్చుకున్న మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారని, కవిత కూడా జైల్లో ఉండాలని, కానీ బయట ఎందుకున్నారని ప్రశ్నించారు. పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, అధికార ప్రతినిధులు జక్కని సంజయ్, జక్కుల వెంకన్న పాల్గొన్నారు.