- బీఎల్పీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు సామాజిక న్యాయానికి ప్రతిబింబమని బహుజన లెఫ్ట్ పార్టీ- రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ తెలిపారు. 30 ఏండ్లకు పైగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేసిన పోరాటాలకు భవిష్యత్తులో మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని పార్టీ ఆఫీసులో వెంకట్మీడియాతో మాట్లాడారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఆదివాసీ, న్యాయకపోడు, ఎరుకల, లంబాడా తదితర ఎస్టీ గిరిజన తెగలకు రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం అందుతుందని వెల్లడించారు. పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య, ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ల అమలు కోసం ఎస్సీ, ఎస్టీలు ఉద్యమించాలని కోరారు. ఈ సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు సబ్బని లత, కాంబ్లే మధు, సాయి కాంబ్లే, టి.రాజులు పాల్గొన్నారు.