రానున్న ఎన్నికల్లో బీఎస్పీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ పేదల పార్టీ అని.. తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి రంగంలో ఫెయిల్ అయిందని ఆరోపించారు. ప్రజల ముందుకు వచ్చేందుకు కేసీఆర్ కు ముఖం లేదని చెప్పారు. మంత్రులు కేటీఆర్,హరీష్ రావు, పోలీస్ బందోబస్తు, ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ కుల గణనకు పూర్తి మోకాళ్ల అడ్డుకొని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ బీసీ ఓట్లకు గాలం వేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. బీసీలకు 32 స్థానాలే కేటాయించి మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తుందన్నారు.
రాష్ట్ర జనాభాలో 90 శాతం ఉన్న బడుగు,దళిత గిరిజన మైనార్టీలు రాజ్యాధికారానికి చేజిక్కించుకోకుండా అగ్రకుల నాయకులు అడ్డుపడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సూర్యాపేటలో వట్టే జానయ్యపై అక్రమ కేసుల వెనుక మంత్రి జగదీశ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.