
లక్నో: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ఆమె తొలగించారు. అన్ని పదవుల నుంచి ఆకాష్‌ను మాయావతి తొలగించడం చర్చనీయాంశమైంది. బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. ఈ సమావేశంలోనే ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించినట్లు మాయావతి బీఎస్పీ నేతలకు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఎస్పీ రాజకీయ వారసత్వంపై మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికున్నంత వరకూ బీఎస్పీ రాజకీయ వారసత్వం అందిపుచ్చుకునే అవకాశం ఏ ఒక్కరికీ ఇవ్వడం జరగదని, ఆ ప్రస్తావనే రాదని మాయావతి కుండబద్ధలు కొట్టారు.
ఆకాష్ ఆనంద్ తండ్రి ఆనంద్ కుమార్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాయావతి నియమించారు. రాజ్యసభ ఎంపీ రామ్ జీ గౌతమ్ను కొత్త నేషనల్ కోఆర్డినేటర్గా బీఎస్పీ అధినేత్రి నియమించడం గమనార్హం. ఆకాష్ ఆనంద్ మామ, మాజీ రాజ్యసభ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ను పార్టీలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నాడనే కారణంగా మాయావతి బీఎస్పీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
అయితే.. బీఎస్పీని బలహీనపరచడమే లక్ష్యంగా ఆకాష్ ఆనంద్ను తన మామ అశోక్ సిద్ధార్థ్ ప్రోత్సహిస్తున్నాడని, ఆనంద్ రాజకీయ జీవితం తన మామ వల్ల ప్రభావితం అయిందని.. అందుకే ఆకాశ్ ఆనంద్ను బీఎస్పీ నుంచి తొలగిస్తున్నామని మాయావతి కీలక ప్రకటన చేశారు.