- డప్పు కొట్టే వ్యక్తిని కూడా అసెంబ్లీకి పంపే సత్తా బీఎస్పీది
- ఎన్నికల టైమ్‌లోనే పార్టీలకు బహుజనులు గుర్తుకొస్తరు
- ఎల్లారెడ్డి బహిరంగ సభలో బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్
ఎల్లారెడ్డి, వెలుగు: దొరలు కూర్చొనే అసెంబ్లీలో బహుజనులకు కూడా కూర్చొనే రోజులు రాబోతున్నాయని బహుజన సామాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. డప్పు కొట్టే వ్యక్తిని అసెంబ్లీకి పంపే సత్తా బీఎస్పీకి ఉందని ప్రవీణ్కుమార్చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నీ రాజకీయ పార్టీలు బహుజనులను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
ఈ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని అగ్రవర్ణాల నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వీటిపై విచారణ జరగాలన్నారు. బీజేపీ మాదిగల మీద మొసలి కన్నీరు కార్చి, మోసం చేస్తుందన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉండే బీఎస్పీ అభ్యర్థి జమున రాథోడ్ ని గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బాలరాజ్, జిల్లాలో బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థులు సురేశ్‌గౌడ్, ప్రజ్ఞ కుమార్, ఈశ్వర్ ధర్మేందర్ పాల్గొన్నారు.