అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఆరుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని.. మూడు రోజుల్లోగా పూచీకత్తులను సబ్మిట్ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. 

డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం (డిసెంబర్ 22) అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బన్నీ ఇంటి ముందు బైఠాయించారు. రేవతి ఫ్యామిలీకి రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఆందోళన సమయంలో కొందరు బన్నీ ఇంటి కంపౌండ్ వాల్ ఎక్కి రాళ్లు, టమాటాలు రువ్వగా.. మరి కొందరు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అనంతరం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం (డిసెంబర్ 23) ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్‎లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. ఈ క్రమంలో నిందితులకు మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు.